Amaravati: సచివాలయం, హెచ్ఓడీ నిర్మాణానికి టెండర్లు ఖరారు
అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం (Secretariat), హెచ్ఓడీ టవర్ల (HOD Towers ) నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. టెండర్లలో ఎల్ 1గా నిలిచిన సంస్థలకు బిడ్లు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్ ఏపీ సెక్రటేరియట్, హెచ్ఓడీ కార్యాలయాల ( జీఏడీ టవర్) నిర్మాణ టెండర్లను ఎన్సీసీ లిమిటెడ్ (NCC Limited ) సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ రూ.882.47 కోట్లతో సచివాలయంలోని జీఏడీ టవర్‌ను నిర్మించనుంది. ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 1, 2 హెచ్ఓడీ టవర్ల నిర్మాణ పనులను షాపూర్ జీ పల్లోంజి(G Pallonji) సంస్థ దక్కించుకుంది. రూ.1487.11 కోట్ల వ్యయంతో ఈ టవర్ల నిర్మాణ పనులు చేపట్టనుంది. ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 3, 4 హెచ్ఓడీ టవర్ల నిర్మాణ పనులను లార్సెన్ లాండ్ టౌబ్రో లిమిటెడ్ దక్కించుకుంది. రూ.1303.85 కోట్ల వ్యంతో నిర్మాణాలు చేపట్టనుంది. ఎల్ 1 బిడ్డర్లకు ప్రతిపాదిత పనులు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ (Suresh Kumar) ఆదేశాలు జారీ చేశారు.













