మహాపరనిర్వాణం – సావిత్రి ఆత్మ చేసిన మహాప్రస్థానం
మహాపరినిర్వాణం బౌద్ధ గ్రంథాల్లో బుద్ధుని చివరి దశను, అంటే జనన, మరణ చక్రం నుండి శాశ్వతంగా విముక్తి పొందడాన్ని సూచిస్తుంది. మృత్యువాత పడ్డ సత్యవంతుడు సావిత్రి సంకల్పంతో, మృత్యువుతో జరిపిన సుదీర్ఘ వాగ్వివాదంతో పునర్జీవుడయిన ఈ కథనానికి శ్రీ శార్వరి పెట్టిన పేరు మహాపరనిర్వాణం. బుద్ధునిది జనన, మరణ చక్రం నుంచి శాశ్వతమైన విముక్తి అయితే సత్యవంతుడిది మరణం నుంచి పునరుజ్జీవనం.
మృత్యువుతో సావిత్రి చేసిన పోరాటం ఒక ఆశయ సిద్ధికోసం. అసంభవాన్ని సంభవం చేయగలననే బల నిరూపణకు కాకుండా, సత్యవంతుడితో జీవితకాలం జీవించడం తన జన్మ హక్కుగా భావించడం వల్ల, నమ్మినందు వల్ల సావిత్రి కార్మోనుఖురాలైంది, మృత్యువుతో తలపడింది. ఆత్మచైతన్యంతో పరచైతన్యాన్ని అందిపుచ్చుకోగలిగింది, ఆ పరాశక్తితో మృత్యువుని సహితం శాసించగలిగింది, జయించగలిగింది. అష్టైశ్వర్యాలు, సంపదలు, భోగభాగ్యాలు తనకు తృణప్రాయమని, సత్యవంతుడితో జీవించడమే అన్నింటికన్నా మిన్న అని మృత్యువుకి తేల్చి చెప్పింది.
Aurobindo’s:
The Eternal Day: The Soul’s Choice and the Supreme Consummation
A MARVELLOUS Sun looked down from ecstasy’s skies
On worlds of deathless bliss, perfection’s home,
Magical unfoldings of the Eternal’s smile
Capturing his secret heart-beats of delight.
God’s everlasting day surrounded her,
Domains appeared of sempiternal light
Invading all Nature with the Absolute joy.
శ్రీ శార్వరి:
మహాపరనిర్వాణం
ఆనందమయ గగనాల నుండి ప్రజ్ఞా ప్రభాకరుడు
పూర్ణత్వానికి నెలవైన, ఆనందలోకాలలోకి తొంగిచూచాడు
పారమాత్మికమైన సచ్చిదానంద మార్మిక లహరు లేవో
తన ఆనందరహస్య హృదయ స్పందనల్ని ఆక్రమించాయి.
పరబ్రహ్మ అనంత తేజస్సు ఆమెను చుట్టుముట్టింది
అనిర్వచనీయ తేజోమండలాలు దర్శనమిచ్చాయి
సచ్చిదానందం సర్వ ప్రకృతినీ ఆక్రమించింది.
అరవిందుడి ఆంగ్ల రచనకు శార్వరి తెలుగు అనువాదం ఏ మాత్రం తీసిపోకుండా, పాఠకులకు రెండూ సమాంతరంగా, సమున్నతంగా భాసిస్తాయి.
“మానవ ప్రజ్ఞ సంపూర్ణంగా ప్రకాశించినప్పుడు
అంతరంగంలో ‘ఆత్మ’ తేజస్సుతో ప్రజ్వరిల్లుతుంది.
ఇవి కూడా చదవండి
ఆత్మ చైతన్యంతో కలిగే ప్రతి భావం, ప్రతి అనుభూతి పరబ్రహ్మ సంకల్పమే. ప్రతి సంకల్పం దివ్యత్వంతో పరిపూర్ణమైనదే.
సావిత్రి విషయంలో సాక్షాత్తు ఇదే జరిగింది. ఆమె ప్రజ్ణాశీలి. బతుకు తాలూకు నిర్దిష్టమైన ఆలోచనలు, ఆచరణీయాలు కలది. ఆమెకు బాహ్యప్రపంచపు మెరుపులకన్నా ఆత్మౌనత్యంతో కూడిన అతీతమానస సౌందర్యం అభిలషణీయం.
అందుకే అరవిందులు ఇలా అంటారు:
లోకాల సౌందర్యాలను ఆమె గమనించలేదు
కాని ఆమె ఆత్మశక్తి మహత్తర రూపాన్ని పొందింది.
అంధకారంగా, మృత్యువుగా గుర్తించినదాన్ని
ఎదుర్కొనడానికి సర్వశక్తులు సమీకరించుకున్నది.
ఆత్మ అనుభూతులతో ఏవేవో లోకాలకు అలవోకగా చేరుకుంటుంది. అలాగే యోగి ఆత్మ చైతన్యంతో నిగూఢలోకాలన్నీ తిరిగిరాగలడు. సావిత్రి కూడా ఈ ఆత్మ చైతన్యంతోనే మృత్యువుని తిరస్కరించి అనితరం, అసాధ్యం, నిషిద్ధం అయిన పరలోకాల్లోకి సహితం ప్రవేశించగలిగింది. ఇహాన్ని, ఇహలోక సుఖాల్ని సావిత్రి అధిగమించి, జయించి, తిరస్కరించింది కాబట్టి ‘మహాపరనిర్వాణం’ అనడం సబబుగానూ తోస్తుంది.
మన ఆలోచనలకు ఈశ్వర ప్రజ్ఞ ఎన్నటికీ అందదు అంటారు శ్రీ శార్వరి. అంతేకాదు వత్తిడి మరీ ఎక్కువైనప్పుడు, సమస్యల సుడిగుండంలో చిక్కుకొన్నప్పుడు గాని మనిషి పారలౌకికమైన విషయాల గురించి ఆలోచించడు, గుర్తించడు.
సర్వాంతర్యామి అయిన ఈశ్వరున్ని అరవిందులు – శార్వరి ఇలా వర్ణిస్తారు.
పరమాణువులోను, ప్రచండాగ్నిగోళంలోనూ ఈశ్వరుడున్నాడు.
రాయిలో, రప్పలో, మనిషిలో, దేవతలో వున్నది ఈశ్వరుడే.
ఆయన నిశ్చలంగా ఉండడంవల్లనే సృష్టి నడుస్తున్నది.
ఆయన ఉనికి వల్లనే జగత్తు నశించిపోకుండా వుంది.
ఆయనే విశ్వ వలయానికి కేంద్ర బిందువు.
ఆయనే ప్రకృతి వర్తులానికి ఆవరణం.
యోగి మనస్సు విశాలం, వినిర్మలం అవుతున్న కొలదీ
అన్ని వైరుధ్యాలు సమసిపోయి ప్రేమ పెంపొందుతుంది
సహృదయత్వంలో మంచి చెడులు కలసిపోతాయి
పరస్పర అవగాహన దివ్యసంకేతాలతో
ఒకే కుటుంబంలోని సోదరులవలె కలుపుతుంది
అన్నింటికీ అది సమానాశ్రయం కల్పిస్తుంది.
మహాత్ములు కావాలని కోరుకునేది ఈ భూలోకాన్ని.
ఆత్మవీరోచిత పోరాటానికి భూమి తగిన క్షేత్రం.
ఇదే విశ్వపురుషుడు ఎన్నికచేసుకున్న కర్మశాల.
సావిత్రి: మనుషుల కష్టాలే తప్ప స్వర్గాలు నాకవసరం లేదు
అందరూ పంచుకోలేని ఆనందం నాకు తృప్తినివ్వదు.
ఆమెకు కర్తవ్యం తెలుసు అందుకే తన కార్యనిర్వహణకు సత్యవంతుడినే ఆయుధం ఉపయోగించింది, విశ్వజననిగా, విశ్వవిజేతగా నిలచింది.
ఆత్మ కలగన్నదంతా మనం భౌతికంగా చూడలేము, సృష్టించలేము.
మహాపరనిర్వాణం – సావిత్రి ఆత్మ చేసిన మహాప్రస్థానం అందుకే సామాన్యులకి దుస్సాధ్యం.
Dr. Ramana V. Vasili
Spiritual Foundation
7062 Beringer Dr. S.
Cordova, Tennessee 38018, USA
Cell: 901-387-9646
ramanavvasili@hotmail.com








