బాల్టిమోర్ వేదికగా ‘ఆటా’ అందాల పోటీలు.. ఐదు విభాగాల్లో విజేతల ఎంపిక!
ATA: అమెరికాలోని తెలుగు లోగిళ్లలో అందాల సందడి మొదలుకానుంది. ప్రతిష్టాత్మక అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహిస్తున్న 19వ మహాసభల్లో భాగంగా ‘ఆటా పేజెంట్ 2026’ పోటీలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న ఈ మహాసభలు, మన తెలుగు అందాలకు , ప్రతిభకు అంతర్జాతీయ వేదికను అందించనున్నాయి.
ఐదు విభాగాల్లో హోరాహోరీ పోటీలు:
అట్లాంటా, ఆస్టిన్, చికాగో, డల్లాస్, డెట్రాయిట్, DC/MD/VA, లాస్ ఏంజిల్స్, నాష్విల్లే, న్యూజెర్సీ, ఓర్లాండో, ఫినిక్స్, ఫిలడెల్ఫియా, రాలీ
వంటి నగరాల నుంచి అభ్యర్థులు పాల్గొనే ఈ పోటీలను మొత్తం ఐదు విభిన్న విభాగాల్లో నిర్వహిస్తున్నారు.
- Miss-Teen ATA: 13 నుండి 16 ఏళ్ల కిశోర ప్రాయం వారు.
- Miss ATA: 17 ఏళ్లు పైబడిన యువతులు.
- Mr. Teen ATA: 13 నుండి 17 ఏళ్ల లోపు బాలురు.
- Mr. ATA: 17 ఏళ్లు పైబడిన యువకులు.
- Mrs. ATA: 21 ఏళ్లు పైబడిన వివాహిత మహిళల కోసం ప్రత్యేక విభాగం.
రిజిస్ట్రేషన్ గడువు :
ఈ అందాల పోటీల్లో తలపడాలనుకునే ఆటా సభ్యులు $30, సభ్యులు కాని వారు $50 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15 చివరి తేదీ అని తెలిపారు. విజేతలకు ప్రతిష్టాత్మకమైన ‘ఆటా టైటిల్’తో పాటు, సినీ ప్రముఖుల సమక్షంలో అవార్డులను అందజేస్తారు.
మహిళా ప్రతినిధులు:
ఈ వేడుకను చైర్ పర్సన్ ప్రత్యూష నరపరాజు నేతృత్వంలో కో-చైర్లు మీనల్ మణికంఠన్, కావ్య, భార్గవి , అడ్వైజర్లు నీహారిక నవల్గ, స్రవంతి రాచకుళ్ల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా ఆధ్వర్యంలోని కోర్ కమిటీ బృందం ఈ మెగా ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.
ఆసక్తి గల వారు వెంటనే ఆటా అధికారిక వెబ్సైట్ సందర్శించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహక బృందం కోరుతోంది.








