ట్రంప్-జిన్ పింగ్ శిఖరాగ్ర భేటీ.. !
మూడురోజుల బీజింగ్ పర్యటనలో భాగంగా ట్రంప్.. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ తో కీలకాంశాలపైచర్చలు జరిపారు.ముఖ్యంగా ద్వైపాక్షిక బంధం బలోపేతం, వాణిజ్య ఒప్పందాలు, ఇరాన్ యుద్ధం, హర్మూజ్ సంక్షోభం సహా కీలకాంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.ట్రంప్ ప్రధానంగా రెండు దేశాల మధ్య తీవ్రంగా ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడం, క్లిష్టమైన అంతర్జాతీయ సమస్యలపై వ్యూహాత్మక స్థిరత్వాన్ని సాధించడం వంటి ప్రధాన అంశాలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా హర్మూజ్ సంక్షోభం, ఇరాన్ యుద్ధ పరిణామాలు , రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా, తైవాన్ అంశం సహా కీలకాంశాలపై ఇరుదేశాధినేతలు చర్చించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థల అధినేతలు అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి చైనా బాట పట్టడం ఈ పర్యటన ప్రాధాన్యాన్ని అమాంతం పెంచేసింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్, యాపిల్ చీఫ్ టిమ్ కుక్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్తో పాటు మెటా, వీసా, గోల్డ్‌మన్ శాక్స్, బోయింగ్, మాస్టర్‌కార్డ్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు జిన్ పింగ్ తో భేటీ అయ్యారు. ఈసందర్బంగా … చైనా సుమారు 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి అంగీకరించిందని, ఇరు దేశాలకు అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు (Fantastic trade deals) కుదిరాయని ట్రంప్ ప్రకటించారు.
ముఖ్యంగా చైనాలో అమెరికన్ కంపెనీలకు మరింత మార్కెట్ యాక్సెస్ కల్పించడం, అదే సమయంలో అమెరికా పరిశ్రమల్లో చైనా పెట్టుబడులను పెంచే అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. ఈ సమావేశంలో అమెరికాకు చెందిన పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.అలాగే అమెరికాలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఫెంటానిల్ సంక్షోభంపైనా ఇరు దేశాలు చర్చించాయి. అమెరికాకు అక్రమంగా చేరుతున్న ఫెంటానిల్ తయారీ రసాయనాల ప్రవాహాన్ని అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వైట్‌హౌస్ పేర్కొంది.
ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో ..హార్ముజ్ జలసంధి, ప్రపంచ ఇంధన భద్రత కీలకంగా నిలిచాయి. ఇంధన సరఫరాలకు అంతరాయం కలగకుండా హార్ముజ్ జలసంధి ఎల్లప్పుడూ తెరిచి ఉండాలని ట్రంప్-జిన్‌పింగ్ ఇద్దరూ అంగీకరించినట్లు వైట్ హౌస్ తెలిపింది. హార్ముజ్ జలసంధిని సైనికీకరించడాన్ని చైనా వ్యతిరేకించిందని.. అక్కడ టోల్ చార్జీలు విధించే ప్రతిపాదనలకూ కూడా బీజింగ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో హార్ముజ్‌పై ఆధారాన్ని తగ్గించుకునేందుకు అమెరికా నుంచి మరింత చమురు కొనుగోలు చేసే ఆసక్తిని చైనా వ్యక్తం చేసినట్లు వైట్‌హౌస్ వివరించింది..ఇక ఇరాన్ అంశంలో కూడా ఇరు దేశాలు ఒకే అభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించింది. “ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదు” అనే విషయంలో ట్రంప్, జిన్‌పింగ్ ఇద్దరూ ఏకీభవించినట్లు పేర్కొంది.
తైవాన్ అంశంలో ఇరు దేశాలు తమతమ వాదనలకే కట్టుబడ్డాయి. ఒకే చైనా విషయంలో ఎలాంటి మిస్ హ్యాండ్లింగ్ జరిగినా తీవ్రపరిణామాలు తప్పవని జిన్ పింగ్ హెచ్చరించగా.. తైవాన్ స్వతంత్రతకు తాము మద్దతిస్తామని ట్రంప్ బృందం స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగింపు సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మరియు ఆయన భార్య పెంగ్ లియవాన్లను అమెరికాకు ఆహ్వానించారు. ఈ తిరుగు పర్యటన (Reciprocal Visit) సెప్టెంబర్ 24, 2026 న వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లో జరగనుంది.






