దసరా బరిలో మెగాస్టార్ మూవీ
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) హీరోగా డైరెక్టర్ వశిష్ఠ(Vassishta) రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర(Vishwambhara) రిలీజ్ పై మరోసారి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. చాలా కాలంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన ఈ సినిమా ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కథకు ప్రాణంగా నిలిచే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ను వేగంగా పూర్తి చేసే దిశగా చిత్ర బృందం కసరత్తు చేస్తోందని సమాచారం. భారీ కాన్వాస్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి సీన్ ఆడియన్స్ కు కొత్త అనుభూతిని అందించేలా సాంకేతిక ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం విశ్వంభరను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో మేకర్స్ ప్లాన్ రెడీ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ, నిర్ణయించిన సమయానికి అన్ని పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ వేగాన్ని మరింత పెంచినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యతే సినిమాకు ప్రధాన బలం కావడంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ నిపుణులు కూడా పని చేస్తున్నారనే సమాచారం ఉంది. చిరంజీవిని ఇప్పటివరకు చూడని ఫాంటసీ ప్రపంచంలో ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఒకవేళ దసరా బరిలో ఈ సినిమా రిలీజైతే పండుగ సీజన్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








