అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని నెం.1గా తీర్చిదిద్దుతాం : మంత్రి నారా లోకేష్
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ ను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తా
పులివెందుల ఎమ్మెల్యే ఏపీలో నివసిస్తే రెండేళ్లలో ఏం చేశామో తెలుస్తుంది
ఎవరి ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు
గొడ్డలి బ్యాచ్ కు మహిళలను గౌరవించడం తెలియదు
జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరు
డీఎస్సీపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం
మంగళగిరిలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్
తాడేపల్లి: అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని నెం.1గా తీర్చిదిద్దుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 2019లో 5,300 ఓట్ల తేడాతో మంగళగిరిలో నేను ఓడిపోయాను. మొదటి రోజు బాధ, ఆవేదన కలిగింది. రెండో రోజు ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఊరూరా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నా. 2024 ఎన్నికల్లో 53వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే కొండంత బలం వస్తుందని చెప్పాను. నా కోరికను మన్నించి రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజార్టీతో గెలిపించారు. నాపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. గెలిచిన మొదటిరోజు నుంచే మంగళగిరి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పవర్ మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి ఏర్పాటుచేస్తున్నాం. దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ప్రారంభించాం. లైబ్రరీలకు పూర్వవైభవం తీసుకువస్తున్నాం. మంగళగిరి పట్టణంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నాం. పార్క్ లు, లేక్ లు, కమ్యూనిటీ భవనాలు, చివరకు శ్మశానాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం.
అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని నెం.1గా తీర్చిదిద్దుతాం
రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మంగళగిరికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను తీసుకువచ్చాం. ఎంపీ పెమ్మసాని గారు కేంద్రంతో మాట్లాడి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మంగళగిరికి మంజూరు చేయించారు. ఇది మంగళగిరి ప్రజల అదృష్టం. మంగళగిరి నియోజకవర్గ వాసిగా ఈ ప్రాజెక్ట్ ను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తా. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించాను. అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం నెం.1గా ఉండాలనేది లక్ష్యం. ఇందుకోసం అహర్నిశలు కష్టపడతా. రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు మోడల్ గా మంగళగిరిని రూపొందిస్తాం. మిగతా నియోజకవర్గాల్లో కూడా దశలవారీగా చేపడతాం.
పులివెందుల ఎమ్మెల్యే ఏపీలో నివసిస్తే వాస్తవాలు తెలుస్తాయి
ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వృద్ధులకు రూ.4వేల పెన్షన్, వికలాంగులకు రూ.6వేలు, ప్రతిఏడాది ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా ఆర్థికసాయం అందిస్తున్నాం. మత్స్యకార సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో, అన్నదాత సుఖీభవ కింద కేంద్రం, రాష్ట్రం కలిసి రూ.20వేలు అందిస్తున్నాం. ఇచ్చిన హామీలు పద్దతి ప్రకారం నెరవేరుస్తున్నాం. పులివెందుల ఎమ్మెల్యే బెంగళూరులో కాకుండా ఏపీలో నివసిస్తే వాస్తవాలు తెలుస్తాయి. బెంగళూరులో మూడు రోజులు, తాడేపల్లిలో ఒకరోజు, హైదరాబాద్ లో మూడు రోజులు ఆయన నివసిస్తారు. అందుకే ఆయన బెంతాహై.
ఇవి కూడా చదవండి
ఎవరి ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు
ఎవరి ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు. ఓటు నమోదు పకడ్బందీగా చేయాలనేది మా లక్ష్యం. కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. పబ్లిక్ లో ఉన్న డేటానే మా వద్ద కూడా ఉంది. వైసీపీకి ఐటీలో అవగాహన లేదుకాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఒక యాప్ తయారుచేసి మా కార్యకర్తలకు సులభతరం చేశాం. విజనరీకి, ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది. ప్రిజనరీ ఎప్పుడూ జైలు వైపు చూస్తాడు. ఆయన చుట్టూ ఎప్పుడూ రౌడీలు ఉంటారు. మహిళలను కించపరిచే వారు ఉంటారు. విజనరీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25శాతం ఏపీకి వస్తున్నాయి. ఇందుకు బ్రాండ్ సీబీఎన్ కారణం. 76 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు గారు ఆయనే కొబ్బరికాయ తీసుకుని కొడతారు. సైకిల్ తొక్కుతారు. పులివెందుల ఎమ్మెల్యే అదికూడా చేయలేరు.
గొడ్డలి బ్యాచ్ కు మహిళలను గౌరవించడం తెలియదు
ఇండస్ట్రీకి, కోడిగుడ్డుకు తేడా తెలియని వ్యక్తి ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఉన్న పరిశ్రమలు తరిమేశారు. హోంమంత్రి అనితపై కోడిగుడ్డు మంత్రిగా పనిచేసిన వ్యక్తి కించపరిచేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు చాలా బాధాకరం. గుడివాడ అమర్ నాథ్ ను చాలా బాగా చేశావని జగన్ రెడ్డి పొగిడారంట. అసలు వీరు ఎక్కడికి పోతున్నారు? ఇదేవిధంగా భారతిరెడ్డి గారి గురించి, మీ ఇద్దరు కూతుళ్ల గురించి మాట్లాడితే సమర్థిస్తారా? ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించారు. బ్రాహ్మణిని అవమానించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే.. క్షమాపణే కాదు.. అతడిని జ్యూడిషియల్ రిమాండ్ కు పంపిన ఘనత ప్రజాప్రభుత్వానిది. అదీ మహిళల పట్ల మా గౌరవానికి నిదర్శనం. గొడ్డలి బ్యాచ్ కు మహిళలను గౌరవంచడం తెలియదు. జగన్ లో జీ అంటే గొడ్డలి.
జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరు
జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరు. మేం డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించాం. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ ను అధ్యయనం చేసి కచ్చితమైన నోటిఫికేన్ ఇచ్చాం. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా మేం నోటిఫికేషన్ ఇచ్చాం. 150 రోజుల్లో 16వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్లీ టెట్ పరీక్ష జరుగుతుంది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. మళ్లీ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సాక్షి కేలండర్ కాదు.. పదివేల పోస్టులతో జాబ్ కేలండర్ ఇచ్చాం. మొదటిసారి హారిజాంటల్ రిజర్వేషన్ అమలుచేశాం. దీనిగురించి తెలుసుకోవాల్సిన బాధ్యత యువతపై ఉంది. హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోతే సబర్వాల్ జడ్జిమెంట్ అనేది ఉంది. ఆ జడ్జిమెంట్ ను అడ్డం పెట్టుకుని వైసీపీనే కోర్టులో వేసి స్టే తీసుకువస్తారు. వైసీపీ నాయకులే డీఎస్సీపై 240 కేసులు వేశారు.
డీఎస్సీపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఐదేళ్లలో జగన్ రెడ్డి ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏమిటో అర్థమై ఉండేది. మీరు ముందు సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కులం కార్డు కూడా తీసుకువచ్చారు. దౌర్భాగ్యం ఏంటంటే 2014-19 మధ్య కూడా డీఎస్పీ ప్రమోషన్లలో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని దుష్ప్రచారం చేశారు. ప్రజలు కూడా నమ్మారు. తర్వాత వాస్తవాలు బహిర్గతం అయ్యాయి. ఇప్పుడు కూడా పనికిమాలిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ముందుపెట్టుకుని స్పోర్ట్స్ కోటాలో ఒకే సామాజికవర్గం వారికి ఉద్యోగాలు ఇచ్చారని దుష్ప్రచారం చేస్తున్నారు. మేం వాస్తవాలు బహిర్గతం చేశాం. సదరు వ్యక్తి కమాపణలు చెప్పాలి కదా. బురదజల్లి పారిపోతున్నారు. జగన్ రెడ్డి ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఉన్నా. ఎప్పుడైనా చర్చకు సిద్ధమే. మా సమాధానాలపై జగన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేస్తున్నా.
18 నెలల్లో నిడమర్రు ఆర్వోబీ నిర్మాణం పూర్తిచేయాలి
నిడమర్రు ఆర్వోబీ నిర్మాణం 25 ఏళ్ల కల. కేంద్రంతో సంప్రదింపులు జరిపి వచ్చే 20 ఏళ్ల ట్రాఫిక్ ను పరిగణనలోకి తీసుకుని బ్రిడ్జిని నిర్మించుకోవడం జరుగుతుంది. 18 నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతోంది. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తున్నాం. ఇందుకు సుమారు రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మంగళగిరి పెద్దఎత్తున అభివృద్ధి చెందుతోంది. తాగునీటి ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. కేంద్ర మంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ మంగళగిరి పనులు పూర్తిచేస్తున్నాం. అండర్ గ్రౌండ్ పవర్ తో పాటు అండర్ గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ గ్యాస్ కూడా ప్రతి ఇంటికి అందిస్తాం. నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తాం. ఒక మోడల్ గా మహాప్రస్థానం ఏర్పాటుచేశాం. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. గత పాలకులు వెస్ట్ బైపాస్ ను సరిగా డిజైన్ చేయలేదు. ఒక్క ఎగ్జిట్ కూడా రాజధానికి ఉండకూడదనే దుర్బుద్ధితో వ్యవహరించారు. జగన్ కు అమరావతిపై కక్ష ఉంది. అవసరమైన మేరకు తాము ఎగ్జిట్ లు ఏర్పాటుచేస్తామని మంత్రి తెలిపారు.








