Pawan Kalyan: ప్రచారమే కారణమా? పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ దూకుడు వ్యాఖ్యలు..
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ కాంగ్రెస్ (Congress) నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాజకీయ వేదికపై పవన్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఆయనను ఉద్దేశించి అనుచిత పదజాలంతో మాట్లాడటం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ముఖ్యంగా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పవన్‌పై దూకుడుగా స్పందిస్తున్నారు.
ఈ వివాదానికి ప్రధాన కారణం తెలంగాణలో జరగనున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, మొత్తం 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన (Jana Sena Party) నేరుగా పోటీ చేయాలనే నిర్ణయంతో ముందుకు వచ్చింది. పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తూ, కొత్త కమిటీలు ఏర్పాటు చేసి, అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను స్థానిక నాయకులకు అప్పగించింది.
ఆ దశలో పవన్ కల్యాణ్‌పై ఎలాంటి విమర్శలు వినిపించలేదు. పైగా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని కొందరు కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానించారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీ (BJP)–జనసేన మధ్య అవగాహన కుదరడంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవడం కాంగ్రెస్‌ను అసహనానికి గురిచేసింది.
ఈ అవగాహన ప్రకారం పవన్, జనసేన అభ్యర్థులతో పాటు బీజేపీ తరఫున కూడా ప్రచారం చేయనున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఇదే కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ నుంచి ఇతర నాయకుల వరకూ జనసేనను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పవన్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. ఆయనను “పవన్ కళ్యాణ్ కాదు, దిష్టి కళ్యాణ్” అంటూ విమర్శించడం రాజకీయ మర్యాదలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ బీజేపీ పవన్ ముందు మోకరిల్లిందంటూ ఎద్దేవా చేయడం, పవన్ కేవలం ఆంధ్రప్రదేశ్ నాయకుడేనని చెప్పడం వంటి వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. అలాగే తెలంగాణ భాష, యాసపై పవన్ గతంలో మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.
బుధవారం మహేష్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల తర్వాత, గురువారం తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కూడా అదే స్థాయిలో జనసేనపై స్పందించడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి వరుసగా వస్తున్న ఈ విమర్శలకు జనసేన నేతలు ఘాటుగా సమాధానం చెబుతున్నారు. జనసేన ఏపీకి మాత్రమే పరిమితమైన పార్టీ కాదని, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువల కోసం ఏర్పడిన రాజకీయ శక్తిగా వారు వివరిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మొదలైన ఈ మాటల యుద్ధం మరింత ఎటు దారి తీస్తుందో, రాబోయే రోజుల్లో రాజకీయ వాతావరణం ఎలా మారుతుందో చూడాల్సిందే.






