Dr. Ramana V. Vasili: రమణీయాలు: 5 అర్ధశతాబ్దపు యోగసాధనతో శార్వరీరవిందులు పంచిన “యోగ విభూతి”
ఇది అరవిందుని సావిత్రి మహాకావ్యంలోని “ది బుక్ ఆఫ్ యోగా”కు శార్వరి వినిర్మితి, “యోగవిభూతి”.
యోగవిభూతి అన్నది ఇక్కడ పదార్థమో, లేదా ఒకరికి మరొకరు ఇచ్చే విభూతి కాదు. యోగసాధనతో సాధకుడు మానసికంగానో, ఆత్మపరంగానో పొందిన అనుభవాలను పదుగురికి పంచడం లేదా మానవ శ్రేయస్సు కోసం వినియోగించడం అనుకోవచ్చు. యోగవిభూతితో మనిషికి సంపూర్ణత్వం చేకూరుతుంది. కొందరు ఈ పరిపూర్ణతని ఆధ్యాత్మికంగా కోరుకుంటే మరికొందరు భౌతికంగా కోరుకుంటారు. మనం చేసే పనులన్నీ పరమాత్మ సంకల్పాలే. ప్రతిక్రియను భగవత్కార్యంగానే భావించాలి. కొందరు ఆరాధన, యోగసాధన, ధ్యానం, తపస్సు ఇలా భక్తి మార్గాలతో భగవంతుని అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తే మరికొందరు సేవా దృక్పథంతో పరమాత్మ కృపకి పాత్రులు అవుతారు.
ఆధ్యాత్మిక చింతనతో ఊర్ధ్వచైతన్య స్థితికి చేరుకున్నంత మాత్రాన, అశాశ్వతమైన వాస్తవాన్ని ఆలోచనలతో జయించినంత మాత్రాన ప్రయోజనం ఏమిటి? అని కొందరు ప్రశ్నిస్తే, అశరీర అయిన ఆత్మను అన్వేషించినా, లేక అగోచరమైన దాన్ని అన్వేషించడమే లక్ష్యం అయినా నాకు గానీ, మరొకరికి గానీ ఒనగూరే లాభం లేదా ప్రయోజనం ఏమిటి అంటూ మరికొందరు కొందరు ప్రశ్నిస్తారు. అందుకే వారు భౌతిక పరిధిలోనే ఏ పనైనా చేస్తారు, ఏదైనా సాధించాలనుకుంటారు. మన సనాతన ధర్మం కూడా దాన్ని అంగీకరిస్తుంది. “ధర్మో రక్షతి రక్షితః” “వృక్షో రక్షతి రక్షితః” అంటాము. ధర్మాన్ని పాటించడం, ఆచరించడం, కాపాడటం ఎంత ముఖ్యమో, మానవ మనుగడకు, సర్వజీవుల సుఖజీవనానికి వృక్షసంపదను రక్షించాలని వేదాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి. మన సంస్కృతి ప్రకృతితో మమేకమైనది. మన పూర్వీకులు, పురాణాలు, పుణ్యపరుషులూ, ఋష్యాశ్రమాలు అన్నీ వన్యప్రాంతాలతో, వన్యప్రాణులతో ముడిపడినవే. నైమిశారణ్యం, దండకారణ్యం, తాతకవనం, ఖాండవవనం, హిండంబవనం వంటి అటవీ ప్రాంతాలు మన రామాయణ, మహాభారతాల్లో ప్రముఖంగా పేర్కొనబడ్డాయి. చెట్లు, పుట్టలు, పశుపక్షాదులే కాదు సమస్త ప్రాణుల్లో పరమాత్మను ఆరాధించే సంస్కృతి మనది. సమస్త ప్రాణికోటి ఈశ్వర స్వరూపమే, సృష్టిలోని అంతర్భాగలే. అందుకే కొందరు భౌతిక ప్రపంచానికి ఇచ్చిన ప్రాధాన్యత, కనిపించని స్వర్గానికి ఇవ్వరు.
ప్రణయం-మరణం
The Joy of Union; the Ordeal of the Foreknowledge of Death and the Heart’s Grief and Pain
ప్రాపంచికమైన ప్రేమలు, అవి ఇచ్చే ఆనందం అశాశ్వతం అయినా వాటికి మనం బందీలం. సావిత్రి సత్యవంతుల ప్రేమ అద్వితీయం, ఆత్మానుబంధం, జన్మ జన్మల బంధం అందుకే వారి ప్రగాఢ సంయోగంలో ఆమె ఆత్మ అతని ఆత్మలో నియంత్రణమైంది. సత్యవంతుడి మరణంతో విడిపోవలసివస్తే, జననమరణ చక్రభ్రమణంలో మళ్ళీ ఎంతకాలానికి, ఎక్కడ కలుసుకుంటామో, ఈ ప్రేమను మనం పొందగలిగేది మళ్ళీ ఎన్నటికో అని చెప్పాలనుకునేది సావిత్రి, కాని సత్యవంతుడి మీది ప్రేమాతిశయం వల్ల చెప్పలేకపోయింది, తన విచారభారాన్ని అతని తలపైకెత్తలేకపోయింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని తన గుండెల్లోనే దాచుకుని, నిస్సహాయంగా, నిబ్బరంగా, నిర్మోహంగా ప్రవర్తించింది సావిత్రి.
అడవిలో కట్టెలు కొట్టుకురావడానికి వెళ్లినప్పుడు, అరణ్యంలో ఆహారానికై వేటకు వెళ్లిన సమయం, అంధుడైన తండ్రికి సేవలు చేసేకాలం, మినహా మిగతా సమయమంతా సావిత్రి సాన్నిధ్యంలో, ఆమె ఆనందం కోసం, తృప్తి కోసం వెచ్చించే వాడు సత్యవంతుడు. అనవరతం ఆమెను తన కౌగిలిలో బంధించేవాడు. తాను ఆమె ప్రేమలో ఉక్కిరిబిక్కిరై సర్వం మరచేవాడు.
ఒకొక్కసారి ఆమెకు అనిపించేది, యుగయుగాల బాధ తన ఒక్కదానిలో విషాదంగా గూడు కట్టుకున్నట్లు, ఈ యాతనామయ ప్రపంచం తనలోనె కనిపిస్తున్నట్లు. అతను అరణ్యంలో తిరుగుతున్నప్పుడు సైతం ఆమె ఆత్మ అతనిని వెన్నంటి ఉండేది. మృత్యువు ఏ నిమిషంలోనైనా కబళించవచ్చనే భయంతో తాను అతన్ని నీడలా అనుసరించేది, అతను చేసే ప్రతి పనిని గమనిస్తుండేది. అంతరాత్మలో, ఏ శక్తి తమను వేరు చేయలేదన్న నమ్మకం.
దేవతల్లా ఆత్మకు చావు లేకపోయినా మనిషిగా జన్మించిన సావిత్రికి కాలం, కర్మం కొట్టేదెబ్బలకు గురి అయింది. సత్యవంతుడితో సహజీవనం ఏడాది పాటు సాగింది. ఇప్పుడు మృత్యువు అంచున సత్యవంతుడు, ఆమె గుండె విషాద ఆకాశమే అయింది. కన్నీటిని జయించాలి, అంతకంటే ముఖ్యమైనది, మృత్యువును జయించాలి.
ఆత్మశోధన
The Finding of the Soul
The Parable of the Search for the Soul
ఒకనాడు సత్యవంతుని కోసం అన్వేషించింది. ఇప్పుడు సత్యం కోసం అన్వేషించాలి. మృత్యువుతో తలపడటం అంటే పరప్రజ్ణతో పోరాటమే. ఈ లోకం అజ్ఞానం నుండి, అంధకారం నుండి బయట పడి వెలుగును చూసే అవకాశమే లేదా? మనిషి ఇలా ‘కర్మ’కు, ‘విధి’కి తలవొగ్గవలసిందేనా? అత్యల్ప మానవ ప్రపంచంలో అనల్ప ధర్మం ఎలా ప్రతిష్టించాలి? అశాశ్వతం నుండి శాశ్వతత్వానికి తీసుకెళ్ళే సువిశాల, సువర్ణపథంలో మనిషిని సత్యం వైపు నడిపించే ప్రయత్నం సావిత్రిది.
ఆత్మదర్శనం
The Entry into the Inner Countries
Aurobindo:
Fate followed her foreseen immutable road.
శార్వరి:
ముందుగా చూడగలిగిన మార్గంలో విధి ఆమెను వెన్నాడింది.
Aurobindo:
Man’s hopes and longings build the journeying wheels
That bear the body of his destiny
And lead his blind will towards an unknown goal.
శార్వరి:
మనిషి ఆశలు, ఆశయాలు అతని లక్ష్యానికి
అనుకూలంగా, అగోచర గమ్యానికి చేర్చేవిధంగా,
అతని సంకల్పం గుడ్డిగా, జీవితరధాన్ని నడిపిస్తాయి.
Aurobindo:
His fate within him shapes his acts and rules;
Its face and form already are born in him,
Its parentage is in his secret soul.
శార్వరి:
అంతర్విధి అతని చర్యలను, కర్మలను రూపుదిద్దుతుంది.
అందుకు అనుగుణంగానే రూపం, బుద్ధి ఏర్పడి ఉంటాయి.
వాని మాతృకలు అతని ఆత్మలో గుప్తంగా ఉంటాయి.
సావిత్రి విధి వంచితుడైన భర్త ప్రక్కన స్థాణువులా, అంతరంగంలో రగులుతున్న అగ్నిజ్వాలలకు ప్రతిరూపంగా కూర్చుండిపోయింది. జగన్మాతే అంతర్వాణిగా సావిత్రిని కార్మోనుఖురాల్ని చేసి ఈ విధంగా బోధించింది. నీ మనస్సు నిశ్చలం చేసిన కొలదీ నీలో నిర్మలత్వం ఏర్పడి పరమసత్యం నీలో నీకే తెలుస్తుంది, నీవే చూడగలుగుతావు. ఆత్మదృష్టికి అవరోధంగా వున్న తెరల్ని తొలగించుకో నీ మనస్సు మహాశూన్యస్థితిని చేరుకున్నప్పుడు ఈ ప్రపంచంలో పరమాత్మ రూపాన్ని దర్శించగలవు. నీ ఆత్మ వినగలిగిన అన్ని శబ్దాలలో పరమాత్మను తెలుసుకో.
ఒక వృక్షం మొత్తం దాని బీజంలో నిక్షిప్తమై ఉన్నట్లు సృష్టిలోని సంభవాలన్నీ మనిషిలోనే దాగి ఉన్నాయి. మనిషిలోని గతం, భవిష్యత్తుకు బాట వేస్తుంది. అతని వర్తమాన కర్మలు భవిష్యత్ విధిని ఏర్పరుస్తాయి, జీవితంలో మలుపులన్నీ అసంకల్పిత చర్యలే. మనిషిని ఉద్థరించగల శక్తి ఒకటి ఉంది అదే లోకాన్ని రక్షించగల పరాశక్తి. మనలో ఏ కొద్దిమందో భవిష్యత్తును చూడగలరు, వారికే స్థిరత్వం, స్థిర సంకల్పం, జీవిత లక్ష్యం ఉంటాయి. ఆ కోవకు చెందినదే సావిత్రి. మన గతమే భవిష్యత్తుకు పదకంకణ నిక్వాణాలు.
గత జన్మకృత పాపాలు ఈ జన్మలో ఆత్మను పట్టుకుంటాయి. గతంలోని జీవిత శేషమే ప్రస్తుత జన్మ అవుతుంది.మనపైన పారలౌకికమైన దివ్యత్వం ఉంటుంది. మనకు దిగువున అజ్ఞానం చీకట్లలో నిశబ్దంగా వుంటుంది. ఈ లోకాన్ని సృష్టించింది సత్యమే గానీ అంధప్రకృతీ శక్తి కాదు. కాలం, జీవితం, మృత్యువు అన్నీ వచ్చిపోయేవే.
బాహ్యప్రపంచాన్ని మరిచి, అంతర్లోకాలలో తనను తాను అన్వేషించడం ఇప్పుడు సావిత్రికి ఎదురైన సమస్య. ఈ విధమైన ఆధ్యాత్మిక జిజ్ఞాస, తపన, అన్వేషణ, సాధన, లక్ష్యానికి దగ్గరగా చేర్చుతుంది. ఈ అన్వేషణలో అనుభవాలు, అనుభూతులు మాటలకు, వర్ణనలకు అందేవి కావు. కంటికి కనిపించే వాటినే సంపూర్ణంగా మాటలతో వర్ణించలేని మనం, అంతర్దృష్టికి అనుభూతమయ్యేవాటిని ఎలా వర్ణించగలం, అసాధ్యం. అందుకే వాటిని అంతర్లోకాలు అంటున్నాం.
వ్యక్తిగతంగా ముక్తిని సాధించడం సావిత్రి లక్ష్యం కాదు. అల్పాయుష్కుడైన పతిని దక్కించుకోవడానికి కంకణం కట్టుకున్నది. బీజాక్షరాలు పరమాత్మకు సంకేతాలైతే వాటి నామోచ్ఛారణ వల్ల సావిత్రికి అనల్పమైన శక్తులు చేకూరాయి. ఆత్మాగతమైన సుప్రశాంతలో సావిత్రి ఒక మహత్తర తేజోమండలాన్ని చేరుకుంది.
ఏ ఇద్దరు సాధకుల అనుభవాలు, అనుభూతులు ఒకటిగా ఉండవు. భౌతిక శరీరంలోనే దివ్యమైన ఆత్మను గుర్తించాలి. లోకం చూడరాదని తలుపులు బిగించి ధ్యానించినా, మందిరంలో చేసే తపస్సు విశ్వవ్యాప్తమవుతుంది. మనస్సు నిశ్చలమైనప్పుడు ఏర్పడేది ప్రశాంతస్థితి. ఆ ప్రశాంతస్ధితిలో ఉద్రేకాలు వుండవు. ఇంద్రియార్భాటాలన్నీ నిశ్శబ్దంలో కరిగిపోతాయి. మేధ పరాచైతన్యంతో ఉత్తేజమవుతుంది. మనస్సే ఆత్మగా, ఆత్మశక్తిగా మారుతుంది. అటువంటి సుస్థిర, అచరస్థితికి చేరుకుంది సావిత్రి.
ఈ అస్థిర అయోమయ ప్రపంచంలో ఒక స్థిరవిశ్వాసంతో జీవించేవారు ధన్యులు లేదా తమ ఆధ్యాత్మిక హృదయక్షేత్రంలో ఒక పవిత్ర బీజాన్ని నాటుకున్నవారు ధన్యులు. యోగసాధనతో శాశ్వతము, సుస్థిరము అయిన సత్యాన్ని తెలుసుకోవాలి. తమను తాము ఉద్ధరించుకున్నవారే ఇతరుల్ని ఉద్ధరించగలరు. ఈశ్వరీయత పట్ల, జగన్మాత కరుణా కటాక్షాలు పట్ల అచంచల విశ్వాసం ఉన్న వారు సుఖజీవులు. సావిత్రి ఆ కోవకు చెందుతుంది.
“ఆనంద స్వరూపులైన ఓ తేజోమూర్తులారా! గుప్తమైన మహాతేజస్సుకు మూలం ఏమిటో చెప్పండి” అంటూ ప్రశ్నించింది ఆమె.
శక్తిత్రయం
The Triple Soul-Forces
Aurobindo:
O Savitri, I am the secret soul.
To share the suffering of the world I came,
I draw my children’s pangs into my breast.
I am the nurse of the dolour beneath the stars;
I am the soul of all wailing writhe
Under the ruthless harrow of the Gods.
శార్వరి:
సావిత్రీ! రహస్యమైన నీ ఆత్మను నేను
ఈ విశ్వ విషాదాన్ని పంచుకొనడానికై వచ్చాను
నా బిడ్డల కష్టాన్ని నా గుండెలోకి తీసుకుంటాను
తారకల క్రిందనున్న లోకానికి ఊరట కలిగించేది నేను
దేవతల కారణంగా నిర్దాక్షిణ్యంగా బాధలుపడి
నైరాశ్యంలో క్రుంగిపోయేవారి ఆత్మను నేను.
Aurobindo:
I am woman, nurse and slave and beaten beast;
I tend the hands that gave me cruel blows.
The hearts that spurned my love and zeal I serve;
I am the courted queen, the pampered doll,
I am the giver of the bowl of rice,
I am the worshipped Angel of the House.
శార్వరి:
నేను అబలను, సేవించను, బానిసను, దెబ్బలుతినే పశువును
నన్ను క్రూరంగా హింసించినవారిని ప్రేమతో లాలిస్తాడు
నన్ను గర్హించి, ద్వేషించేవారిని సైతం ప్రేమిస్తాను
అందరూ వాంఛించే సుందరిని, అందాల బొమ్మను
భుక్తిని, తుష్టిని కలిగించేది నేను
దేవాలయంలో పూజలందుకునే దేవతను నేను.
సావిత్రి-భౌతికంగా దైన్యమూర్తి, అంతర్ముఖంగా శక్తి స్వరూపిణి, తేజో రూపిణి. మనిషి జన్మించినప్పటి నుండి మరణించే వరకూ అనుభవించే బాధలకు, కష్టాలకు, కన్నీళ్లకు ప్రతీక దైన్యమూర్తి. అసమానమైన శక్తి సామర్థ్యాలకు ప్రతీక శక్తిస్వరూపిణి. ఆనందానికి, శాంతానికి ప్రతీక తేజోస్వరూపిణి. ఈ త్రిమూర్తుల అంశే సావిత్రి. లోకంలోని విషాదాన్ని శాశ్వతంగా తీసివేయాలని, లోకం కన్నీరు తుడిచివేయాలని ప్రతినబూనింది.
ప్రకృతి ధర్మానుసారం ప్రతి జీవి ఒంటరిదే. పరమాత్మను తనలో నిలుపుకున్నప్పుడే మనిషికి నిజమైన శక్తి. మనిషి భావనాజీవి. ప్రకృతితో పోరాడగలవాడు అందుకే ప్రకృతిని తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తాడు. మనిషి కష్టాలతో ప్రకృతి పరిణామం చెందుతుంది. సత్యవంతుడి మృతి, సావిత్రి మృత్యువుపై పోరాడటానికి కారణభూతమైంది.
జగన్మాత
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Cosmic Consciousness
పాపపుణ్యాలు, మంచి చెడులు కలగలిసిన మానవ జీవితంలో అడుగడుగునా వెలుగునీడల సయ్యాటలే. మనిషి సంపాదించే యావత్తు భౌతికమే. మనిషిని సన్మార్గంలో నడిపించే శక్తి, జగన్మాత. చైతన్యవంతమైన మనిషిని ఉన్నత శిఖరాలకు చేర్చేది ఆ పరాశక్తే. మనిషి చేసే తప్పిదాలు, పాపాలు, పరమపదసోపానాలు. అనుభవాలు వెలుగుకు చిరుబాటలు. మౌనంతో చైతన్యం, మృత్యువుతో అమరత్వం సాధ్యమని జగన్మాత అన్నట్లు సావిత్రి నమ్మింది. జగన్మాత వాక్కు నిజమనేందుకు నిదర్శనమే సావిత్రి సత్యవంతుల కథ.
సృష్టిలో పరమాత్మ చైతన్యరూపాలు అనేకాలు. ఆ పరచైతన్యమే, మనిషి నిత్యకృత్యాలను వారి వారి కర్మలకు అనుగుణంగా ప్రభావితం చేసి పునీతం చేస్తుంటాయి. పవిత్రులు పోరాడినా, మరణించినా ఆ పరమాత్మ కొరకే. భౌతికరూపానికి వ్యక్తిత్వాన్ని, విలువలను పెంచి దాన్ని క్రమంగా దివ్యసువర్ణమూర్తిగా మలచగలిగేది ఆ పరమాత్మే.
నిరాశజీవులకి ధైర్యం చెప్పి రక్షించే శక్తి అదే. భయంకర నిశీధిలో పహారాకాస్తున్నదీ ఆ పరాశక్తే.
నెమ్మదిగా పయనించే వారు ఎక్కువ చూడగలుగుతారు. వేగంగా వెళ్లేవారితో పోల్చుకుంటే నెమ్మదిగా పయనించే వారిలో నిలకడ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, దూరదర్శన చతురత ఎక్కువగా ఉంటాయి. పరాన్వేషణలో ఇది ఎంతో కీలకం.
మనిషికి చరమలక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి?
ఈ మహత్తర సృజనకు ప్రయోజనం ఏమిటి?
ఈ మహత్తర శక్తులన్నీ పొంది సాధించేది ఏమిటి?
ఈ మహత్తర సృష్టి, ప్రకృతి ఏర్పడటమే ఒక మహా అద్భుతం. ఆలోచనలకు కేంద్రమైన మానవమేధ మరీ అద్భుతం. అసలు జీవంలోని ప్రాణశక్తి మరీ మరీ విచిత్రం. మనిషిని విధి ఎలా నడిపిస్తుందో తెలియదు. మనకు తెలిసినదల్లా, తాను కోరని మార్గాలలో విధి మనిషిని నడిపిస్తుందని. ఆ విధిచక్రం క్రిందపడి మనిషి నలిగిపోతుంటాడు.
మానవాత్మ వాంఛించే మార్మిక స్వర్గాలన్నీ మేధస్సు సృష్టించుకునే భావనాలోకాలే. అన్నీ కరిగిపోయే కలలు, కల్పనా విశేషాలు అని నమ్మేవారు కోకొల్లలు. అదే నిజమైతే, ఈ సృష్టి, ప్రపంచం అంతా ఒక సంశయం అవుతుంది అంటారు శార్వరీరవిందులు.
(అయిదవ పుస్తకం “నిర్వాణం” సమీక్షలో మరిన్ని విషయాలు చర్చిద్దాం, అంతవరకు సెలవు.)
Dr. Ramana V. Vasili
Spiritual Foundation
7062 Beringer Dr. S.
Cordova, Tennessee 38018, USA
Cell: 901-387-9646
ramanavvasili@hotmail.com






