Statin Medicine: స్టాటిన్ మందులు ప్రాణదాతలా? లేక ప్రమాదకారులా? తాజా పరిశోధన ఏం చెబుతోంది!
Statin Medicine: అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులతో బాధపడేవారికి ప్రాణరక్షక మందులుగా గుర్తింపు పొందిన స్టాటిన్స్ (Statins) భద్రతపై నెలకొన్న అనుమానాలను తాజా పరిశోధన పటాపంచలు చేసింది. ప్రఖ్యాత ‘లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, అటోర్వాస్టాటిన్రో, సువాస్టాటిన్ వంటి మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల కంటే అవి ఇచ్చే గుండె రక్షణే ఎంతో విలువైనదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
పరిశోధకులు గత 30 ఏళ్ల డేటాను, సుమారు 1.20 లక్షల మందిపై జరిగిన క్లినికల్ ట్రయల్స్‌ను విశ్లేషించారు. స్టాటిన్స్ వాడే వారిలో కండరాల నొప్పులు, అలసట వంటి సమస్యలు కేవలం 5 శాతం లోపు మందిలోనే కనిపిస్తాయని, అవి కూడా చాలా వరకు తాత్కాలికమేనని తేలింది. జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్రలేమి లేదా కాలేయ సమస్యలు స్టాటిన్స్ వల్ల వస్తాయనేది కేవలం అపోహ మాత్రమేనని ఈ అధ్యయనం ధ్రువీకరించింది. ప్రతి చిన్నపాటి దుష్ప్రభావానికి బదులుగా, ఈ మందులు వందలాది నివారించదగిన గుండెపోటులను, స్ట్రోక్స్‌ను అడ్డుకుంటున్నాయని వైద్యులు వెల్లడించారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారం వల్ల చాలా మంది రోగులు భయంతో మందులు మానేస్తున్నారు. ఒక్క యూకేలోనే ఇలాంటి వార్తల వల్ల 2 లక్షల మందికి పైగా రోగులు స్టాటిన్స్ వాడటం ఆపివేయగా, అది వేలాది మంది ప్రాణాపాయానికి దారితీసిందని నిపుణులు హెచ్చరించారు. స్టాటిన్స్ నేడు అందుబాటులో ఉన్న అత్యంత ప్రభావవంతమైన నివారణ మందులని, వీటిని వైద్యుల పర్యవేక్షణలో వాడటం వల్ల కొలెస్ట్రాల్‌ను నియంత్రించి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందవచ్చని ప్రముఖ కార్డియాలజిస్టులు భరోసా ఇచ్చారు. భయం వీడి సరైన చికిత్స పొందడమే మేలని ఈ పరిశోధన సారాంశం.






