Kavitha New Political Party: మున్సిపల్ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్పై మాజీ ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు..
Kavitha New Political Party : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత బిఆర్ఎస్ పార్టీపై, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, బీసీల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం ఆ పార్టీకి ఓటు వేయాలో వద్దో ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ వైఖరిపై విమర్శలు: ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం అస్సలు కనిపించడం లేదని, ఆ పార్టీ నాయకులు కింది స్థాయిలో అసలు యాక్టివ్‌గా లేరని కవిత ఎద్దేవా చేశారు. “కృష్ణార్జునులు లాంటి పెద్ద నాయకులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదు? వారిని గాలికి వదిలేశారా?” అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన వ్యక్తికి టికెట్ కేటాయించడాన్ని బట్టి చూస్తే, ఆ పార్టీకి బీసీలపై ఉన్న ప్రేమ ఎంతో అర్థమవుతుందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని, కానీ ప్రస్తుత పార్టీ తీరు సరిగ్గా లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
కొత్త పార్టీ దిశగా అడుగులు: ఈ సందర్భంగా తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను కవిత వెల్లడించారు. తాము ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని, దీనికి సంబంధించి మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. మరో మూడు నెలల్లో పార్టీ ఏర్పాటు ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ఆమె స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి సూచనలు: కేవలం విపక్షాలనే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని హితవు పలికారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తానని, తన మాటల్లో నిజాయితీ లేకపోతే ప్రజలే నిలదీస్తారని కవిత పేర్కొన్నారు.






