TTD: ఛీ.. ఛీ.. భక్తుల ఆరోగ్యంతో ఇంతటి నీచమైన ఆటలా.. తిరుమల లడ్డూ కల్తీ కేసులో వణుకు పుట్టించే నిజాలు..
TTD: వైకాపా హయాంలో తిరుమలకు సరఫరా అయిన కల్తీ నెయ్యి కేసులో తవ్వే కొద్దీ దారుణమైన విషయాలు బయటకు వస్తున్నాయి. సాధారణంగా ఆయిల్ మరకలు తొలగించడానికి, టాయిలెట్ క్లీనర్ల తయారీలో క్లీనింగ్ ఏజెంట్గా వాడే ‘లబ్సా’ (లీనియర్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్)ను నెయ్యి కల్తీలో వాడటంపై సిట్ తన అభియోగపత్రంలో కీలక వివరాలను పొందుపరిచింది.
కల్తీ వెనుక భారీ కుట్ర: దిల్లీలోని అరిస్టో కెమికల్స్ నుంచి భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు దాదాపు 8,900 కిలోల లాక్టిక్ యాసిడ్, లబ్సాను కొనుగోలు చేసినట్లు ఆధారాలు దొరికాయి. పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ వంటి చౌకరకం నూనెలకు ఈ రసాయనాలను కలిపితే, అవి అచ్చం నెయ్యికి ఉండే రంగు, రుచి, వాసనను సంతరించుకుంటాయి. ల్యాబ్ పరీక్షల్లో కూడా ఇది నెయ్యి అని నమ్మించేలా చేసేందుకు బీటా-కెరోటిన్ , ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వంటి మిశ్రమాలను కూడా జోడించారు. దాదాపు 57.56 లక్షల కిలోల నూనెను ఇలా రసాయనాలతో కల్తీ చేసి తితిదేకు (తిరుమల తిరుపతి దేవస్థానం) నెయ్యి పేరుతో అంటగట్టారు.
ఆరోగ్యంపై ముప్పు: ఆహార భద్రతా చట్టం ప్రకారం పాలు, నెయ్యి వంటి ఉత్పత్తుల్లో లబ్సా వాడటం పూర్తిగా నిషేధం. ఈ రసాయనం కలిసిన పదార్థాలను తీసుకుంటే జీర్ణాశయం దెబ్బతినడం, పేగులకు గాయాలవ్వడం, కాలేయ వ్యాధులు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్కు కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక డెయిరీకి వేల కిలోల క్లీనింగ్ రసాయనాలు ఎందుకనే కోణంలో దర్యాప్తు చేసిన సిట్, కల్తీ నెయ్యి తయారీ కోసమే వీటిని వాడినట్లు స్పష్టం చేసింది.






