Pawan Kalyan: తెలంగాణ మున్సిపల్ పోరు: రంగంలోకి పవన్ కల్యాణ్..!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంట్రీతో ఎన్నికల ముఖచిత్రం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మంగళగిరి వేదికగా జరిగిన కీలక సమావేశం, బీజేపీ-జనసేన మైత్రి తెలంగాణ గడ్డపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనే చర్చకు తెరలేపింది.
మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ఇంచార్జి శంకర్ గౌడ్ వంటి కీలక నేతలు పాల్గొన్నారు.
ఈ భేటీలో పవన్ ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించారు. జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. శని, ఆదివారాల్లో తాను స్వయంగా ప్రచారం చేస్తానని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలతో కలిసి పనిచేయాలని నేతలకు సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో బీజేపీ కొంత ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు.. పవన్ కల్యాణ్‌ను కలిసి మద్దతు కోరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కేవలం తన పార్టీ అభ్యర్థులకే కాకుండా, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కూడా ప్రచారం చేస్తానని ప్రకటించడం కమలం పార్టీకి కొండంత అండగా మారింది.
పవన్ కల్యాణ్ ప్రచార నిర్ణయం వ్యూహం దాగిఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పవన్ కల్యాణ్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. మున్సిపల్ ఎన్నికలు పట్టణ ఓటర్లతో ముడిపడి ఉన్నందున, ఆయన ప్రచారం యువతను, సినీ అభిమానులను పోలింగ్ బూత్‌ల వైపు నడిపించే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు జనసేన కూడా ప్రభావం చూపితే, ఓట్ల చీలిక ఎవరికి నష్టం చేస్తుందనేది ఆసక్తికరం. గతంలో జనసేన పోటీ చేయని చోట్ల ఓట్లు ఇతర పార్టీలకు మళ్లగా, ఇప్పుడు ఆ ఓట్లు జనసేన-బిజెపి కూటమికి పడే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో వెనుకబడినట్లు కనిపిస్తున్న బీజేపీ కార్యకర్తలకు పవన్ రాక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కిషన్ రెడ్డి వంటి సీనియర్ నేతల విజ్ఞప్తి మేరకు పవన్ స్పందించడం, భవిష్యత్తులో ఈ రెండు పార్టీల పొత్తు మరింత బలపడుతుందనే సంకేతాలను ఇస్తోంది.
ఈ నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, పవన్ కల్యాణ్ 7,8 తేదీల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ తక్కువ సమయంలో ఆయన ఎన్ని మున్సిపాలిటీలను కవర్ చేయగలరు? ఆయన ప్రచారం ఓట్లుగా మారుతుందా లేక కేవలం జనసందోహానికే పరిమితమవుతుందా? అనేది చూడాలి.
మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీ తమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుండగా, బీఆర్ఎస్ పార్టీ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య పవన్ కల్యాణ్ ఏ మేరకు తన ముద్ర వేస్తారో వేచి చూడాలి.






