Pawan Kalyan: పుర పోరులో పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు.. మున్సిపల్ బరిలో మిత్రపక్షాలకు ఊహించని షాక్!
Pawan Kalyan: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ ఎంట్రీ ఇవ్వడం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ముఖ్యంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారానికి వస్తున్నారనే వార్తతో అభ్యర్థుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, అనూహ్యంగా కొన్ని అనివార్య కారణాల వల్ల తన తెలంగాణ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు పవన్ ప్రకటించారు.
ముందస్తు ప్రణాళికలు: రాబోయే శని, ఆదివారాల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించి, తన పార్టీ అభ్యర్థులతో పాటు మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయాల్సి ఉంది. పట్టణ ఓటర్లలో పవన్‌కు ఉన్న ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ఇప్పటికే ఆయనతో భేటీ అయి మద్దతు కోరారు. ఇందుకు పవన్ సానుకూలంగా స్పందించి షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసుకున్నారు.
అభ్యర్థుల్లో నిరాశ: పవన్ కళ్యాణ్ ప్రచారం తమ గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆశించిన బీజేపీ-జనసేన అభ్యర్థులు, ఆయన పర్యటన రద్దు కావడంతో ఒకింత నిరాశకు గురయ్యారు. యువతలో ఉన్న క్రేజ్ కారణంగా ఓట్లు చీలకుండా పవన్‌ను రంగంలోకి దింపాలని భావించిన బీజేపీకి ఇది కొంత ఎదురుదెబ్బగానే భావించవచ్చు. ప్రస్తుతం ఆయన ప్రచారం రద్దు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.






