Ameenpur Lake Pollution: కాలుష్యం కోరల్లో అమీన్పూర్.. వలస పక్షుల కొత్త చిరునామా ‘సంగుపేట’!
Sangareddy: పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే మూగజీవాల మనుగడ ఎంతలా ప్రశ్నార్థకమవుతుందో చెప్పడానికి హైదరాబాద్ శివార్లలోని చెరువుల దుస్థితే నిదర్శనం. ఒకప్పుడు వేలాది పక్షులకు ఆవాసంగా, పర్యాటక కేంద్రంగా విరాజిల్లిన అమీన్పూర్ చెరువు ప్రస్తుతం మురుగు కూపంగా మారుతోంది. అమీన్పూర్ చెరువులో డ్రైనేజీ నీరు కలవడంతో పాటు, ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు భారీగా పేరుకుపోతున్నాయి. ఆహారం కోసం వెతుక్కునే కొంగలు, ఇతర జలచరాలు ప్లాస్టిక్ కుప్పల మధ్యే గడపాల్సిన దారుణ పరిస్థితి నెలకొంది. ఈ కాలుష్యం కారణంగా చేపలు, పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
వలస పక్షుల వలస: అమీన్పూర్ చెరువు కలుషితం కావడంతో, గతంలో అక్కడికి వచ్చే విదేశీ అతిథులు ఇప్పుడు తమ దారిని మార్చుకున్నాయి. నేపాల్, భూటాన్ వంటి సుదూర దేశాల నుండి వచ్చే పెయింటెడ్ స్టార్క్స్, గ్రీన్ ఈటర్స్ వంటి విలక్షణమైన పక్షులు ఇప్పుడు జోగిపేట సమీపంలోని సంగుపేట చెరువును తమ కొత్త ఆవాసంగా ఎంచుకున్నాయి. గత కొన్ని రోజులుగా సంగుపేట జలాశయం ఈ విదేశీ పక్షుల కిలకిల రావాలతో సందడిగా మారింది.
అమీన్పూర్ చెరువులో కాలుష్యం పెరగడం వల్లే పక్షులు ఇక్కడికి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మన స్వార్థం కోసం విసిరేసే ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికే కాకుండా, వేల మైళ్ల దూరం నుండి వచ్చే అతిథి పక్షుల ఆశలను కూడా చిదిమేస్తున్నాయని ఈ సంఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు, ప్రజలు స్పందించి ఈ సహజ సిద్ధమైన చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






