YS Viveka Case : వివేకా హత్య కేసు విచారణ.. మళ్లీ మొదటికొచ్చిందా..?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకోనుంది. ఈ కేసులో కేవలం ఒక కోణానికే పరిమితం కాకుండా, లోతైన మరియు విస్తృతమైన దర్యాప్తు జరపడానికి సీబీఐకి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ఎన్.కె. సింగ్లతో కూడిన ధర్మాసనం గురువారం వెలువరించిన ఉత్తర్వులు ఈ కేసులో ఉన్న అడ్డంకులను తొలగించడమే కాకుండా, బాధితులకు న్యాయం జరిగే దిశగా ఆశాకిరణంగా మారాయి. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన సమాచార మార్పిడితో పాటు, దర్యాప్తులో వెలుగుచూసే ఏ కొత్త అంశంపైనైనా విచారణ జరిపేందుకు సీబీఐకి సర్వోన్నత న్యాయస్థానం పూర్తి స్వేచ్ఛను ప్రసాదించింది.
గత ఏడాది డిసెంబర్ 10న సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రధానంగా నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వైఎస్ భాస్కరరెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డిల మధ్య హత్య జరిగిన రోజున జరిగిన డేటా మార్పిడిపై విచారణ జరపాలని గతంలో కోర్టు ఆదేశించింది. అయితే, తాజా ఉత్తర్వులతో సీబీఐ తన విచారణను కేవలం వీరిద్దరికే పరిమితం చేయనవసరం లేదని చెప్పంది. విచారణ క్రమంలో ఏవైనా కొత్త ఆధారాలు లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం బయటపడితే, వారిని కూడా విచారించే పూర్తి స్వేచ్ఛను ధర్మాసనం కల్పించింది.
వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు ఆమెకు ఒక కీలక అవకాశాన్ని కల్పించింది. ఈ కేసుకు సంబంధించి ఆమె వద్ద ఏవైనా అదనపు సాక్ష్యాధారాలు లేదా సమాచారం ఉంటే నేరుగా సీబీఐకి సమర్పించవచ్చని కోర్టు పేర్కొంది. దీనివల్ల బాధితుల పక్షం నుండి లభించే సమాచారం దర్యాప్తు సంస్థకు మరింత బలాన్ని చేకూర్చనుంది.
ట్రయల్ కోర్టు గతంలో నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని గడువు విధించింది. అయితే, అటువంటి తక్కువ సమయం దర్యాప్తు సంస్థపై ఒత్తిడి పెంచి, లోపభూయిష్ట విచారణకు దారితీస్తుందని సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ‘నెల రోజులు’ అనే పదాన్ని సవరించింది. సీబీఐ సాధ్యమైనంత త్వరగా విచారణను పూర్తి చేయాలని సూచిస్తూనే, దర్యాప్తు లోతును దెబ్బతీయకుండా తగిన సమయం ఇచ్చింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ కేసులో ఏదైనా అసంతృప్తి ఉంటే హైకోర్టుకు వెళ్లవచ్చని న్యాయమూర్తులు ప్రస్తావించినప్పటికీ, అది మరో 2-3 ఏళ్ల కాలయాపనకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే, కేసును త్వరగా కొలిక్కి తెచ్చే ఉద్దేశంతో పిటిషన్ను సుప్రీంకోర్టులోనే పెండింగ్లో ఉంచి, పరిస్థితిని పర్యవేక్షించాలని ధర్మాసనం నిర్ణయించింది. “మీరు దర్యాప్తు కొనసాగించండి. ఎవరినైనా విచారించేందుకు మీకు స్వేచ్ఛ ఉంది” అని న్యాయమూర్తులు సీబీఐకి స్పష్టం చేయడం, ఈ కేసులో ‘పెద్ద తలకాయల’ ప్రమేయంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
వివేకా హత్య కేసులో గొడ్డలి వేటు వేసింది ఎవరు అన్న ప్రాథమిక ప్రశ్న కంటే, దాని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరు? ఏయే సమాచార మార్పిడి ఈ హత్యకు దారితీసింది? అన్న కోణంలో ఇప్పుడు విచారణ సాగనుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ వెసులుబాటుతో సీబీఐ ఎలాంటి కొత్త సాక్ష్యాలను బయటకు తీస్తుందనేది ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడటంతో, ఈలోపు సీబీఐ సమర్పించే నివేదిక ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించనుంది.






