Chris Hemsworth: అల్జీమర్స్ ముప్పుపై నోరు విప్పిన ‘థోర్’ స్టార్.. కెరీర్ ముగిసిపోయిందనే వార్తలపై క్రిస్ హెమ్స్‌వర్త్ ఏమన్నారంటే?
Chris Hemsworth: హాలీవుడ్ స్టార్ క్రిస్ హెమ్స్‌వర్త్ తన ఆరోగ్యానికి సంబంధించిన ఒక కీలక విషయాన్ని ధైర్యంగా పంచుకున్నారు. 2022లో ‘లిమిట్లెస్’ అనే డాక్యుమెంటరీ చిత్రీకరణ సమయంలో, తనలో APOE4 అనే జన్యువుకు సంబంధించిన రెండు కాపీలు ఉన్నాయని ఆయన తెలుసుకున్నారు. దీనివల్ల ఆయనకు భవిష్యత్తులో అల్జీమర్స్ (మతిమరుపు వ్యాధి) వచ్చే అవకాశం ఇతరుల కంటే 8 నుండి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ఈ విషయాన్ని బయటకు చెబితే, తన ‘యాక్షన్ స్టార్’ ఇమేజ్ దెబ్బతింటుందా లేదా నిర్మాతలు తనను నమ్మడం మానేస్తారా అని ఆయన మొదట భయపడ్డారు. కానీ, తన తండ్రి కూడా అల్జీమర్స్‌తో బాధపడుతుండటంతో, ఈ సమస్యపై అవగాహన కల్పించాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన తండ్రి జ్ఞాపకాలను గౌరవిస్తూ 2025లో ఆయనతో కలిసి ‘రోడ్ ట్రిప్ టు రిమెంబర్’ అనే డాక్యుమెంటరీలో కూడా నటించారు.
అయితే, ఈ ఆరోగ్య కారణాల వల్ల తాను సినిమాల నుంచి రిటైర్ అవుతున్నట్లు వస్తున్న వార్తలను క్రిస్ ఖండించారు. “నేను కేవలం అలసిపోయాను, అందుకే నా భార్యాపిల్లలతో గడపడానికి కొంత విరామం తీసుకున్నాను తప్ప, వ్యాధి భయంతో సినిమాలను వదిలేయడం లేదు” అని స్పష్టం చేశారు. జీవితం ఎంత సున్నితమైనదో ఈ అనుభవం తనకు నేర్పిందని, అందుకే ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి ప్రాధాన్యత ఇస్తున్నానని ఆయన తెలిపారు. తాను అజేయుడిని కాదని తెలుసుకోవడం తనను మానసికంగా మరింత దృఢంగా మార్చిందని ఆయన వివరించారు.






