కార్పొరేట్ లైఫ్ నుండి అంటార్కిటికా మంచు శిఖరాల దాకా.. రికార్డులు సృష్టిస్తున్న సతీష్ గోగినేని!
హైదరాబాద్: భాగ్యనగరంలో జన్మించి ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో నివసిస్తున్న ప్రముఖ భారతీయ సాహసికుడు, మౌంటెనీర్ , ఎండ్యూరెన్స్ అథ్లెట్ సతీష్ గోగినేని అంతర్జాతీయ సాహస యాత్రల రంగంలో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిగ్రీలు పూర్తి చేసిన సతీష్, ఆ తర్వాత ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ రంగంలో స్థిరపడ్డారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి గ్లోబల్ బ్యాంకింగ్ సంస్థలో లీడర్షిప్ బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వహించారు. అయితే పర్వతారోహణ , సాహసయాత్రలపై ఉన్న మక్కువతో తన కార్పొరేట్ కెరీర్ను వదిలి పూర్తిస్థాయి అడ్వెంచర్ ప్రాజెక్టుల వైపు అడుగులు వేశారు.
ఆయన సాధించిన అసాధారణ విజయాలలో అత్యంత కీలకమైనది 2025 జనవరిలో నమోదైంది. అంటార్కిటికా ఖండంలో బయటి నుంచి సహాయం లేకుండా, ఒంటరిగా స్కీయింగ్ చేస్తూ సౌత్ పోల్ (దక్షిణ ధృవం) చేరుకున్న తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. మైనస్ డిగ్రీల అత్యంత కఠినమైన వాతావరణంలో సుమారు 51 రోజుల పాటు నిరంతరం ప్రయాణించి 1,133 కిలోమీటర్ల దూరాన్ని ఆయన ఒంటరిగానే అధిగమించడం విశేషం.
పర్వతారోహణలో అద్భుత రికార్డులు
పర్వతారోహణ రంగంలో సతీష్ గోగినేని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎత్తైన, ప్రమాదకరమైన శిఖరాలను అధిరోహించారు. ప్రపంచంలోనే అతిపెద్దవైన ఐదు 8,000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు.ఆయన అధిరోహించిన ప్రధాన శిఖరాలు మౌంట్ ఎవరెస్ట్, లోట్సే, కాంచనజంగా, అన్నపూర్ణ , ధౌలగిరి. 2022లో కేవలం 19 గంటల లోపు వ్యవధిలోనే ఎవరెస్ట్ , లోట్సే రెండు శిఖరాలను వరుసగా అధిరోహించి, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారతీయుడిగా రికార్డు సృష్టించారు.
మానసిక ఆరోగ్య అవగాహనకు సాహసాల వేదిక
సతీష్ గోగినేని కేవలం రికార్డుల కోసమే కాకుండా ఒక ఉన్నతమైన ఆశయం కోసం ఈ సాహసయాత్రలను వేదికగా చేసుకున్నారు. తన వ్యక్తిగత కుటుంబ అనుభవాల నుండి ప్రేరణ పొంది, సమాజంలో మానసిక ఆరోగ్యం (Mental Health Advocacy)పై ఉన్న అపోహలను తొలగించడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. తన ప్రతి అంతర్జాతీయ ఎక్స్పెడిషన్ ద్వారా మానసిక ఆరోగ్య అవగాహనను పెంపొందించడానికి , అవసరమైన వారికి మద్దతుగా నిలవడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.
భవిష్యత్తు లక్ష్యాలలో భాగంగా నార్త్ పోల్కు ప్రత్యేక యాత్ర చేపట్టడంతో పాటు, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన టెక్నికల్ శిఖరంగా పేరుగాంచిన ‘నుప్ట్సే’ను(Nuptse) అధిరోహించేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సతీష్ గోగినేని చేపట్టిన ప్రతిష్టాత్మక సౌత్ పోల్ సాహసయాత్రకు మద్దతుగా నిలిచిన ముఖ్యులలో ధీరజ్ పామిడిముక్కల (Dheeraj Pamidimukkala) ఒకరు. సాహసయాత్రలపై ఆసక్తి ఉన్న తెలుగు సమాజానికి ఈ పేరు సుపరిచితమే.







