ఏపీలో 24 గంటల్లోనే ‘పర్మనెంట్ నంబర్’..!
రాష్ట్రంలో పాలనను ప్రజల చెంతకు చేర్చడమే కాకుండా, ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రవాణా శాఖలో కీలక మార్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) శ్రీకారం చుట్టారు. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్(Vehicle Registration) కోసం వాహనదారులు రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, కేవలం 24 గంటల్లోనే ఆ ప్రక్రియ పూర్తయ్యేలా సరికొత్త విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
సాధారణంగా వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తనిఖీలు, పత్రాల పరిశీలన పేరుతో జాప్యం జరుగుతుందనే ఫిర్యాదులు ఉన్నాయి. వీటికి చెక్ పెడుతూ, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోగా రవాణా శాఖ(Ap Transport Authority) అధికారులు తమ పని పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా అధికారులు స్పందించకపోతే, ఆ దరఖాస్తును సిస్టమ్ ‘ఆటోమేటిక్’గా ఆమోదిస్తుంది. అంటే, అధికారుల ప్రమేయం లేకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి, వాహనదారుడికి నంబర్ కేటాయించబడుతుంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో దళారీల వ్యవస్థను నిర్మూలించడానికి మరియు ప్రజలకు వ్యయప్రయాసలు తగ్గించడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. టెక్నాలజీని ఉపయోగించుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిజిటలైజ్ చేయడం ద్వారా ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఈ నూతన విధానం రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఇది కేవలం ద్విచక్ర వాహనాలకే కాకుండా అన్ని రకాల కొత్త వాహనాలకు వర్తించనుంది. అయితే ఫ్యాన్సీ నంబర్లకు మాత్రం ప్రస్తుతం ఉన్న పద్దతే కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి








