బేబీ డైరెక్టర్ తో రౌడీ హీరో
టాలీవుడ్లో వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న యువ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) మరో క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రణబాలి(ranabaali), రౌడీ జనార్ధన్(Rowdy janardhan) సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers)తో మరోసారి చేతులు కలపబోతున్నాడని సమాచారం. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన డియర్ కామ్రేడ్(Dear Comrade), ఖుషి(Kushi) ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా, విజయ్‌పై మైత్రి మూవీ మేకర్స్ నమ్మకం మాత్రం ఏమాత్రం తగ్గలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, మధ్యలో ప్రారంభమైన హీరో ప్రాజెక్ట్ కూడా ఆగిపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో రిపీట్ కావడం ఆసక్తికరంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం, బేబీ(Baby) సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సాయి రాజేష్(Sai Rajesh) ఈ సినిమాను తెరకెక్కించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం హిందీలో బేబీ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్న సాయి రాజేష్, విజయ్ కోసం ఓ కొత్త తరహా ఎమోషనల్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. కథా చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, విజయ్ దేవరకొండ కూడా ప్రాజెక్ట్‌పై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. యువతను ఆకట్టుకునే స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌కు కూడా ప్రాధాన్యత ఉండబోతుందట.
ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న రణబాలిపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో ఆయన మరింత జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు. మరోవైపు, బేబీ తర్వాత సాయి రాజేష్‌కు వచ్చిన క్రేజ్ దృష్ట్యా ఈ కాంబోపై ఇండస్ట్రీలో మంచి హైప్ ఏర్పడింది. సరైన కథ, బలమైన ప్రమోషన్స్‌తో వస్తే ఈసారి విజయ్- మైత్రి కాంబో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






