పుష్ప దారిలోనే పెద్ది కూడా!
ఈ వేసవిలో టాలీవుడ్ బాక్సాఫీస్ ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయింది. సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాయి. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసే సినిమాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న పెద్దిపై ఇండస్ట్రీ మొత్తం భారీ అంచనాలు పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా రావడం ఖాయమనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో కనిపిస్తోంది. అయితే నిర్మాతల అసలు టార్గెట్ కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు బలమైన బజ్ తీసుకురావడమే ప్రధాన టార్గెట్‌గా కనిపిస్తోంది. ఎందుకంటే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా నిజమైన విజయాన్ని అందుకోవాలంటే పాన్ ఇండియా స్థాయిలో వసూళ్లు రాబట్టాల్సిందే.
ఈ నేపథ్యంలో పెద్ది(Peddi) టీమ్ చేపట్టిన ప్రమోషన్ ప్లానింగ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 18 నుంచి జూన్ 2 వరకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక షెడ్యూల్ సిద్ధం చేశారు. విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, భోపాల్ వంటి ప్రధాన నగరాల్లో వరుస ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే 20 రోజుల్లో ఎక్కడ చూసినా పెద్ది గురించే చర్చ జరిగేలా మేకర్స్ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఈ స్థాయి అగ్రెసివ్ ప్రమోషన్ ఇటీవల కాలంలో చాలా అరుదుగా కనిపించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప2(Pushpa2)కి కూడా ఇదే తరహా ప్రచార హంగామా భారీగా ఉపయోగపడింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రమోషనల్ టూర్ ఆ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు పెద్ది విషయంలో కూడా అదే ఫార్ములాను అమలు చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రతి ముఖ్య ఈవెంట్లో పాల్గొంటే సినిమాకు మరింత రీచ్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరి నిమిషంలో మొక్కుబడిగా ప్రచారం చేసే పాన్ ఇండియా సినిమాల కంటే ముందుగానే ప్లాన్ చేసి దూకుడుగా వెళ్లడం పెద్దికి పెద్ద ప్లస్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.






