సీఎం విజయ్ ట్యాగ్ కు తలపతి నో
తమిళ సినీ రంగంలో స్టార్ హీరోగా ఎన్నో రికార్డులు సృష్టించిన విజయ్(Vijay) ఇప్పుడు రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ TVK ఘన విజయం సాధించడంతో విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడనే వార్తలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇదే సమయంలో విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతున్న జననాయగన్(Jana Nayagan)పై కూడా భారీ చర్చ మొదలైంది. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్‌కు తలపతి బదులుగా చీఫ్ మినిస్టర్ ట్యాగ్ ఇవ్వబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఎన్నికల సక్సెస్ తర్వాత సినిమాలో ప్రత్యేక మార్పులు చేశారన్న వార్తలను చిత్రబృందం ఖండించినట్లు సమాచారం. ఇప్పటికే షూట్ పూర్తైన ఈ సినిమాలో విజయ్‌కు మొదటి నుంచే ఉన్న తలపతి ట్యాగ్‌నే కొనసాగించనున్నారని తెలుస్తోంది. రాజకీయ విజయాన్ని సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగించాలనే ఆలోచన చిత్ర యూనిట్‌కు లేదని కూడా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ సమస్యలతో నిలిచిపోయింది. మొదట జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేసినా, సెన్సార్ క్లియరెన్స్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడింది.
సామాజిక అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హెచ్. వినోద్(H.Vinoth) దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తుండగా, మమితా బైజు(Mamita Baiju), బాబీ డియోల్(Bobby Deol) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) నిర్మిస్తున్న ఈ సినిమాపై తమిళంతో పాటు దక్షిణాది అంతటా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ స్వయంగా అన్ని అడ్డంకులు తొలగించే ప్రయత్నాల్లో ఉన్నారని, సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన వెంటనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.






