ఏపీలో కేబినెట్ లీక్స్ కలకలం..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదే ‘కేబినెట్ అజెండా లీక్’. ప్రభుత్వ నిర్ణయాలు అధికారికంగా వెలువడక ముందే బయటకు పొక్కడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై మంత్రులకు ఆయన క్లాస్ పీకడమే కాకుండా, సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
సాధారణంగా కేబినెట్ సమావేశం అంటే అత్యంత గోప్యంగా జరిగే ప్రక్రియ. అందులో చర్చించే అంశాలు, తీసుకోబోయే నిర్ణయాలు సమావేశం ముగిసిన తర్వాత మీడియాకు వెల్లడిస్తారు. కానీ, గత కొంతకాలంగా ఏపీలో కేబినెట్ భేటీ కంటే ముందే అజెండాలోని అంశాలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు.
ప్రభుత్వంలోని అత్యున్నత నిర్ణాయక మండలి నిర్ణయాలు ఇలా వీధికెక్కడం ఏంటని సీఎం మంత్రులను సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కీలక సమాచారం బయటకు వెళ్లడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, కొన్ని నిర్ణయాల అమలులో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు గత చరిత్రను గుర్తు చేస్తూ మంత్రులను హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ఆయన ప్రస్తావించారు. గతంలో కేబినెట్ అజెండా లీక్ అయినప్పుడు, క్రమశిక్షణ విషయంలో రాజీ పడని ఎన్టీఆర్ ఏకంగా తన పూర్తి మంత్రిమండలిని రద్దు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇకపై అజెండా లీక్ అయితే దానికి సంబంధిత శాఖా మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.
ప్రభుత్వ సమాచారం లీక్ అవ్వడం వెనుక రెండు ప్రధాన కోణాలు కనిపిస్తున్నాయి. తాము చేస్తున్న పనులు లేదా తీసుకోబోయే నిర్ణయాలను ముందే లీక్ చేయడం ద్వారా క్రెడిట్ కొట్టేయాలని కొందరు మంత్రులు లేదా వారి అనుచరులు ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానం ఉంది. మంత్రుల కార్యాలయాల్లోని పీఎస్ లు లేదా ఇతర సిబ్బంది ద్వారా మీడియాకు సమాచారం చేరుతోందా? అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. భూముల కేటాయింపు లేదా కొత్త పథకాలకు సంబంధించిన నిర్ణయాలు ముందే లీక్ అయితే మార్కెట్ శక్తులు వాటిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కేబినెట్ గోప్యతను కాపాడలేకపోతే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న పట్టు సడలుతుందనే భావన ఏర్పడుతుంది.
చంద్రబాబు కేవలం హెచ్చరికతోనే ఆగిపోకుండా, నిఘా పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. “గతంలో లీకులు జరిగాయి.. ఇకపై అవి పునరావృతం కాకూడదు” అని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఉదంతాన్ని గుర్తు చేయడం ద్వారా, తాను కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోననే సంకేతాన్ని తన కేబినెట్ సహచరులకు పంపారు.
ఇవి కూడా చదవండి






