గుంటూరు జిల్లా రైతులకు చంద్రబాబు గుడ్ న్యూస్..!
గుంటూరు జిల్లా రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరబోతోంది. జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చే అత్యంత కీలకమైన ‘గుంటూరు ఛానెల్’ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. 369.20 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrashekhar) హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈ ఆధునీకరణ పనుల్లో భాగంగా 74 కిలోమీటర్ల మేర గుంటూరు ఛానెల్‌ను విస్తరించనున్నారు. ఈ విస్తరణ ద్వారా ప్రస్తుతం ఉన్న 27 వేల ఎకరాల ఆయకట్టు ఏకంగా 75 వేల ఎకరాలకు పెరగనుంది. అంటే దాదాపు 48 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి రానుంది. కేవలం వ్యవసాయానికే కాకుండా, ఈ ఛానెల్ పరిధిలోని మరో 50 గ్రామాలకు తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. అలాగే, ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన బాధితులకు త్వరలోనే రూ. 60 కోట్ల పరిహారం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని కేంద్ర మంత్రి పెమ్మసాని మండిపడ్డారు. వైసీపీ నిర్లక్ష్యం వల్లే పనులు నిలిచిపోయాయని, లేదంటే ఈ పాటికి జిల్లా రైతులు ఎంతో ప్రయోజనం పొందేవారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చొరవతో 4 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం కలుగుతుందని, దీనివల్ల రైతులకు ఎకరాకు సుమారు రూ. 10 వేల వరకు అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్ల కాల పరిమితిలో ఈ ఆధునీకరణ పనులన్నింటినీ పూర్తి చేసి, ప్రాజెక్టును రైతులకు అంకితం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో గుంటూరు జిల్లా పల్నాడు మరియు డెల్టా ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
ఇవి కూడా చదవండి








