Eye Camp: తోటపల్లి గూడూరు పేదలకు వరం.. ఫిబ్రవరి 15 నుండి మెగా ఉచిత కంటి వైద్య శిబిరం
“నేత్రదానం కన్నా మిన్న.. ఉన్న చూపును కాపాడటం” అనే ఆశయంతో పాపిరెడ్డిపాళెం వాస్తవ్యులు, శాంతాబయో టెక్నీక్స్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి – వసంత దంపతులు తమ జన్మభూమి రుణాన్ని తీర్చుకునేందుకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ తల్లిదండ్రులు కీ.శే. కోడూరు వేంకటరమణా రెడ్డి – శాంతమ్మల జ్ఞాపకార్థం శంకర నేత్రాలయ (చెన్నై), శాంతా – వసంతా ట్రస్టు (హైదరాబాద్) సంయుక్తంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. తోటపల్లి గూడూరు మండలం ఇస్కపాళెం గ్రామంలోని ప్రభుత్వ బి.సి. హాస్టల్ ప్రాంగణంలో ఫిబ్రవరి 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ శిబిరం కొనసాగనుంది. దాదాపు 3వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చివరి 5 రోజుల్లో అత్యాధునిక ‘ఫాకో’ పద్ధతిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తారు.
ఆపరేషన్ చేయించుకున్న వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా అందజేయడంతో పాటు, దూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు, వృద్ధులు కంటి పొరలు (కాటరాక్ట్), డయాబెటిక్ రెటినోపతి వంటి సమస్యలతో చూపు కోల్పోకుండా ఉండటమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశ్యం.
అత్యాధునిక సంచార వాహనాల ద్వారా గ్రామాల వద్దకే వెళ్లి పరీక్షలు నిర్వహించనున్నారు. డబ్బు లేని కారణంతో ఎవరూ చూపు కోల్పోకూడదనే ఉదాత్త భావంతో నిర్వహిస్తున్న ఈ అవకాశాన్ని తోటపల్లి గూడూరు పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.






