టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా శోభారాజు
అన్నమయ్య జిల్లా, మదనపల్లి నియోజకవర్గం, రామసముద్రం మండలం, తిరుమలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ డాక్టర్ శోభరాజును తిరుమల తిరుపతి(టీటీడీ) ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమించారు. బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా గత 40 సంవత్సరాలుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, అన్నమాచార్య, తరిగొండ వెంగమాంబ కీర్తనలకే పరిమితమైన పద్మశ్రీ డాక్టర్ శోభారాజును తిరిగి టీటీడీ ఆస్థాన గాయకురాలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రామసముద్రం మండలం, తిరుమలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీటీడీ ప్రధాన ఆలయ అధికారి స్వర్గీయ ఆర్ జి నారాయణ రాజు, రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె అయిన డాక్టర్ శోభారాజు చిన్నతనం నుండి సంగీతంలో ప్రావీణ్యం పొందారు. తొలుత తన తల్లి ద్వారా శోభారాజు సంగీతాన్ని నేర్చుకున్నారు. తిరుపతిలో విద్యాభ్యాసం చేస్తూ మ్యూజిక్ కళాశాలలో గాయనిగా శిక్షణ పొందారు. ఆ తరువాత ప్రముఖ సంగీత కళాకారులు నుండి శిక్షణ తీసుకున్నారు. అక్కడి నుండి మొదలైన తన తీయ్యటి స్వరాన్ని భారతదేశ సంగీత ప్రియులకు అందిస్తున్నారు. తొలి నుంచి ఈమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబల పైనే పాటలు పాడుతూ తన సంగీత జీవితాన్ని ఆరంభించింది.
ఇవి కూడా చదవండి
సినీ పరిశ్రమలో ఎన్నో అవకాశాలు వచ్చినా నిరాకరిస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామికే అంకితం అవుతూ తన తియ్యటి స్వరాన్ని ఆలపిస్తుంది. వెంకటేశ్వర స్వామి పట్ల ఈమెకు ఉన్న భక్తి, అభిమానాన్ని గుర్తిస్తూ 1978లో తొలిసారిగా గాయనిగా గౌరవిస్తూ టీటీడీ స్కాలర్షిప్స్ అందజేశారు. ఇదే టీటీడీ గాయకరాలకు అందజేసిన తొలి స్కాలర్షిప్స్ గా చెప్పుకోవచ్చు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నమాచార్య కీర్తనలను భక్తులకు వినిపిస్తూ అలరిస్తుంది. ఒక్క తిరుమలలోనే కాకుండా తెలుగు ప్రజలు అధికంగా నివసించే అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, సింగపూర్ వంటి దేశాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో శోభారాజు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నమాచార్య కీర్తనలను తన తియ్యటి స్వరంతో పాడుతుంది. గత 20 సంవత్సరాలుగా హైదరాబాదులో సొంతంగా మ్యూజిక్ కళాశాలను ఏర్పాటు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య కీర్తనలను పాడే విధంగా శిక్షణ ఇచ్చి పలువురిని గాయకురాలుగా మారుస్తున్నారు. వందలాది మందిని తన శిక్షణ ద్వారా సంగీతాన్ని అందించి నేడు ప్రముఖ గాయకులుగా గుర్తింపు పొందిన వారు ఎందరో ఉన్నారు. ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తూ తన సంగీత సామ్రాజ్యాన్ని కొనసాగించారు.
టీటీడీ ఈమెను గౌరవిస్తూ పలుమార్లు ఆస్థాన గాయకురాలుగా నియమించారు. గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీ డాక్టర్ శోభరాజు సేవలను వినియోగించుకోలేకపోయింది. తిరిగి పద్మశ్రీ డాక్టర్ శోభారాజును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులు టీటీడీ ఆస్థాన గాయకురాలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తనను తిరిగి టీటీడీ ఆస్థాన గాయకురాలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు గౌరవిస్తూ ముఖ్యమంత్రి, టీటీడీ పాలకవర్గానికి డాక్టర్ శోభరాజు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
