మంచు కొండల మధ్య పంజాబ్ కు చావో రేవో..!
ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్లో భాగంగా నేడు ధర్మశాలలోని హెచ్పీసీఏ (HPCA) స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య 58వ లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్లేఆఫ్స్ రేసులో అత్యంత కీలకంగా మారింది. ఈ సీజన్ ఆరంభంలో వరుసగా 7 మ్యాచ్‌లలో ఓటమి లేకుండా దూసుకెళ్లిన పంజాబ్ జట్టు.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. నేటి మ్యాచ్‌లో గెలిస్తేనే పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.
మరోవైపు, ఈ ఐపీఎల్ సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుండి ఇప్పటికే అధికారికంగా నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ జట్టు.. కనీసం మిగిలిన మ్యాచ్‌లలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. గాయాలు మరియు ఆటగాళ్ల ఫామ్ ముంబై ఇండియన్స్ జట్టును బాగా వేధిస్తున్నాయి. వెన్నునొప్పి (Back Spasms) కారణంగా ముంబై స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) నేటి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అలాగే గత మ్యాచ్‌లో డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) నేటి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడా లేదా అనే దానిపై కూడా సస్పెన్స్ నడుస్తోంది.
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటివరకు జరిగిన 35 మ్యాచుల్లో పంజాబ్ 18 సార్లు, ముంబై 17 సార్లు విజయం సాధించి ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. అయితే ఈ 2026 సీజన్లోనే ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో జరిగిన మొదటి ముఖాముఖి పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు ముంబైపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ప్రభ్సిమ్రాన్ సింగ్ (80 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్ సాయంతో పంజాబ్ కేవలం 16.3 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో సులువుగా ఛేదించింది. మరి నేటి మ్యాచ్‌లో పంజాబ్ మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేసి ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుందో లేదో చూడాలి.
