రాయలసీమ ఇకపై ‘రక్షణ సీమ’..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న రాయలసీమ రూపురేఖలను మార్చేలా రక్షణ రంగం (Defense Sector) లో భారీ ప్రాజెక్టులు ఇక్కడికి తరలివస్తున్నాయి. ఇకపై రాయలసీమను ‘రక్షణ సీమ’గా మారుస్తామన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) నేరగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా రేపు (శుక్రవారం) శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలకబోతున్నారు.
రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చేలా పుట్టపర్తిలో అక్షరాలా రూ.15,803 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA) ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. దేశ రక్షణ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన యుద్ధ విమానాలు, అధునాతన సాంకేతిక పరికరాల తయారీ, పరిశోధనలు ఈ కేంద్రం ద్వారా సాగనున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమిపూజ చేయనున్నారు.
కేవలం ఈ ఒక్క ఏడీఏ ప్రాజెక్టే కాకుండా, రాయలసీమ వ్యాప్తంగా డిఫెన్స్ మరియు డ్రోన్ (Drone Technology) రంగాలకు సంబంధించి మరో 12 అనుబంధ ప్రాజెక్టులకు కూడా రేపే భూమిపూజ జరగనుంది. ఈ 12 ప్రాజెక్టుల ద్వారా సీమ పరిధిలోని జిల్లాల్లో వేల కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున హై-టెక్నాలజీ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీని దేశంలోనే అతిపెద్ద డ్రోన్ హబ్‌గా మార్చాలనే సీఎం చంద్రబాబు విజన్‌కు ఈ ప్రాజెక్టులు మైలురాయిగా నిలవనున్నాయి.
శుక్రవారం జరగబోయే ఈ మెగా శంకుస్థాపన కార్యక్రమానికి పుట్టపర్తిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర రక్షణ మంత్రి, సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు కీలక మంత్రులు, రక్షణ రంగ ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు ఈ వేడుకకు హాజరుకానున్నారు. వరుసగా వస్తున్న ఈ భారీ పెట్టుబడులతో రాయలసీమ ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుండటం పట్ల స్థానిక ప్రజలు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
