పదేళ్ల పాలనే టార్గెట్.. కాంగ్రెస్ భారీ స్కెచ్!
తెలంగాణలో మరోసారి అధికారం కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. 2023 డిసెంబర్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, కేవలం ఈ ఐదేళ్ల పాలనతో సరిపెట్టుకోకుండా.. పదేళ్ల పాటు అధికారాన్ని సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అటు కేంద్రంలోని బీజేపీని, ఇటు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను ఏకకాలంలో దెబ్బతీసేలా ఒక పక్కా వ్యూహాన్ని టీపీసీసీ సిద్ధం చేసింది.
ఇప్పటివరకు కేవలం ప్రకటనలు, ప్రెస్ మీట్లకే పరిమితమైన కాంగ్రెస్ శ్రేణులు, ఇకపై క్షేత్రస్థాయిలో పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మహిళా కాంగ్రెస్, కిసాన్ సెల్ వంటి అనుబంధ సంఘాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ ఇవి అంత యాక్టివ్ గా లేవు. ఇకపై అనుబంధ సంఘాలు కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం కాకుండా వీధి పోరాటాలకు దిగాలని పీసీసీ ఆదేశించింది. కేవలం విమర్శలు చేయడం మాత్రమే కాకుండా, సామాన్య ప్రజల్లోకి వెళ్లి విపక్షాల తీరును ఎండగట్టాలని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
బీజేపీ, బీఆర్ఎస్ రెండూ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఢిల్లీలో దోస్తీ – గల్లీలో కుస్తీ అనే నినాదంతో ఈ రెండు పార్టీలు ఒకటేనని నిరూపించడం ద్వారా విపక్ష ఓటు బ్యాంకును చీల్చాలని హస్తం పార్టీ భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, ప్రాజెక్టుల వైఫల్యాలను ఎండగడుతూనే.. విభజన హామీల అమలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయంపై ఆధారాలతో సహా రికార్డులను సిద్ధం చేయాలని కేడర్‌కు సూచించింది.
బీఆర్ఎస్ హయాంలోని అవినీతి ఆరోపణలు, ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ లోపాలను సాక్ష్యాలతో ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అలాగే, విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి అంశాలపై బీజేపీ నిర్లక్ష్యాన్ని నిలదీయాలని భావిస్తోంది. ఒకవైపు బీజేపీ మతతత్వ రాజకీయాలను, మరోవైపు బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలను ప్రజలు తిరస్కరించేలా ప్రచారం నిర్వహించాలని భావిస్తోంది. క్షేత్రస్థాయి పోరాటలతో పాటు, సోషల్ మీడియా వేదికగా ఈ రెండు పార్టీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని స్కెచ్ వేసింది.
తెలంగాణలో ప్రస్తుతం త్రిముఖ పోరు కనిపిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ మాత్రం తన వ్యూహాలతో ఇతర పార్టీలను ఆత్మరక్షణలో పడేయాలని చూస్తోంది. ముఖ్యంగా కీలక విపక్ష నేతల బలహీనతలు, వారి గత చరిత్ర, వైఫల్యాలను బయటకు తీయడం ద్వారా ప్రజల్లో ఆ పార్టీల ప్రతిష్టను తగ్గించాలనేది ప్లాన్. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వచ్చే సాధారణ ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదగాలని టీపీసీసీ కృతనిశ్చయంతో ఉంది.
ఇవి కూడా చదవండి
