మోదీ మైండ్ గేమ్.. చిక్కుల్లో కాంగ్రెస్?
ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వ్యూహాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నాయకులను లక్ష్యంగా చేసుకుని మోదీ ఆడుతున్న ‘మైండ్ గేమ్‘ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. నేరుగా విమర్శించడం కంటే, వారిపై సొంత పార్టీలోనే అనుమానాలు కలిగేలా చేయడం మోదీ మార్కు రాజకీయం. గతంలో హిమంత బిస్వ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతల విషయంలో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం.
ప్రధాని మోదీ రాజకీయాల్లో డైరెక్ట్ ఫైట్ కంటే సైకలాజికల్ వార్ చేయడంలో దిట్ట. ఇప్పుడు ఆయన దృష్టి దక్షిణాదిలో కాంగ్రెస్‌కు పవర్ హౌస్‌గా మారిన రేవంత్ రెడ్డిపై పడింది. రేవంత్‌ను ప్రశంసించడం ద్వారా లేదా ఆయనకు సానుకూల సంకేతాలు పంపడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఆయనను అనుమానితుడిగా నిలబెట్టాలనేది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డిని ఒకవైపు అభినందిస్తూనే, మరోవైపు కాంగ్రెస్ అంతర్గత విభేదాలను వాడుకోవాలని బీజేపీ చూస్తోంది.
హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఆసక్తికరంగా మారాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం తనతో కలిసి రావాలని రేవంత్ రెడ్డికి మోదీ నర్మగర్భంగా పిలుపునివ్వడం చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, విభజన హామీలు, నిధుల కోసం రేవంత్ రెడ్డి కేంద్రంతో సఖ్యతగా ఉండాల్సి వస్తోంది. అయితే, ఆయన ప్రధానితో భేటీ అవుతుంటే, దానిని రాజకీయంగా ఉపయోగించుకోవడంలో బీజేపీ వ్యూహకర్తలు సఫలమవుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఇది రేవంత్‌కు ఒక రకమైన ధర్మసంకటం అని చెప్పొచ్చు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి నష్టం, కలిసుంటే సొంత పార్టీలో బీజేపీకి బి-టీమ్ అనే ముద్ర పడే ప్రమాదం ఉంది. మరోవైపు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. రేవంత్ రెడ్డి ఏనాటికైనా బీజేపీలోకి వెళ్తారని, ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి అని కేటీఆర్ వంటి నేతలు పదేపదే ప్రచారం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి శైలి ఎప్పుడూ దూకుడుగానే ఉంటుంది. రాజకీయ అవసరం ఏర్పడినప్పుడు మోదీని అత్యంత కటువుగా విమర్శించడానికి కూడా ఆయన వెనుకాడరు. కానీ, మోదీ విసిరే ప్రశంసల అస్త్రాలు విమర్శల కంటే ప్రమాదకరమైనవి. శత్రువును విమర్శించడం కంటే, పొగడటం ద్వారా అతడిని సొంత గూటిలోనే ఒంటరిని చేసే మోదీ ఎత్తుగడలను రేవంత్ ఎలా తిప్పికొడతారన్నది ఇప్పుడు ఆసక్తికరం. గతంలో కాంగ్రెస్ హైకమాండ్ పట్ల విధేయత చూపిన నేతలే, స్థానిక పరిస్థితులు, కేంద్రం ఇచ్చే ప్రాధాన్యత కారణంగా పార్టీ మారిన సందర్భాలు ఉన్నాయి.
ఇక్కడ అసలైన పరీక్ష రేవంత్ రెడ్డికి కాదు, కాంగ్రెస్ హైకమాండ్‌కే. గతంలో బలమైన నేతలను అనుమానించి, వారిని దూరం చేసుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. ఇప్పుడు రేవంత్ విషయంలో కూడా అదే తప్పు చేస్తే అది పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. మోదీ వేసే పాచికల వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహించి, రేవంత్‌ను రక్షించుకోవాల్సిన సమయం ఇది. రేవంత్‌ను ఏ మాత్రం అనుమానించినా, అది బీజేపీకి రహదారి వేసినట్లే అవుతుంది.
కాబట్టి ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సింది రేవంత్ కంటే ఎక్కువగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలే. మోదీ ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో రేవంత్ రెడ్డి ఒక కీలకమైన ‘రాజు’. ఆ రాజును కాపాడుకోవడం కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లోనే ఉంది. నాయకుల మధ్య అనుమానపు బీజాలు నాటి కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే వ్యూహాన్ని తిప్పికొట్టాలంటే, కాంగ్రెస్ తన అంతర్గత బలాన్ని, నాయకత్వంపై నమ్మకాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి వంటి చురుకైన నాయకుడిని కాపాడుకోలేకపోతే, దక్షిణాదిలో కాంగ్రెస్ కోట బీటలు వారడం ఖాయం.
ఇవి కూడా చదవండి
