ట్రంప్-జిన్ పింగ్ భేటీ అజెండా ఏంటి..?
ప్రస్తుతం ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షిస్తున్న ఒకే ఒక్క అంశం.. ఇవాళ జరగనున్న ట్రంప్-జిన్ పింగ్ శిఖరాగ్ర సమావేశం. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు మండిపోతోంది. ప్రపంచం కూటములుగా మారిపోతోంది. ఏఐ సాంకేతికతతో ప్రపంచ యుద్ధరంగం మారిపోతోంది. ముఖ్యంగా హర్మూజ్ సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇలాంటి తరుణంలో కీలక చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సన్నద్ధమయ్యారు. బీజింగ్ వేదికగా పలు దఫాలు చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో ట్రంప్ తో పాటు టెస్లా అధినేత మస్క్ కూడా పాల్గొననున్నారు.
ట్రంప్-జిన్‌పింగ్ చర్చల్లో అత్యంత కీలకాంశం ఇరాన్ యుద్ధమే. హర్మూజ్ జలసంధిని తెరిచేలా టెహ్రాన్‌పై ఒత్తిడి పెంచాలని బీజింగ్‌కు వాషింగ్టన్ చాలా రోజులుగా సూచిస్తోంది. ఇందుకోసం జిన్‌పింగ్‌ను ఒప్పించేందుకు ట్రంప్ తమ భేటీలో ప్రయత్నించొచ్చు. ఇరాన్‌తో పాటు గల్ఫ్‌లోని పలు ఇతర దేశాలతో చైనాకు సత్సంబంధాలు ఉన్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేలా టెహ్రాన్‌ను ఒప్పించాలనీ ట్రంప్ కోరే అవకాశాలు లేకపోలేదు.
ఇవి కూడా చదవండి
ఏఐ పోరులో..
అమెరికా-చైనా మధ్య ఇప్పుడు పరోక్ష యుద్ధరంగంగా ‘ఏఐ’ మారింది. ఈ రంగంలో ప్రస్తుతానికి వాషింగ్టన్ కాస్త ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. అత్యాధునిక చిప్‌లు, కంప్యూటింగ్ సాంకేతికతల ఎగుమతుల విషయంలో ఆంక్షల ద్వారా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి అది ప్రయత్నిస్తోంది. దీన్ని బీజింగ్ వ్యతిరేకిస్తోంది. ఏఐ రంగంలో తమ సమున్నత లక్ష్యాలకు అవి అడ్డు తగులుతున్నాయని మండిపడుతోంది. ఆంక్షల తొలగింపును చైనా డిమాండ్ చేయొచ్చు.
రేర్ ఎర్త్ మెటీరియల్స్పైనా..
అత్యాధునిక సాంకేతిక సాధనాల తయారీలో కీలకమైన రేర్ ఎర్త్ మెటీరియల్స్ కోసం వాషింగ్టన్, దాని మిత్రపక్షాలు.. బీజింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. వాటి సరఫరాలో అవాంతరాలు తలెత్తకుండా చూడాలని జిన్‌పింగ్‌ను ట్రంప్ కోరే అవకాశాలున్నాయి. అమెరికా-చైనా మధ్య నిరుడు టారిఫ్‌ల యుద్ధం జరిగింది. ట్రంప్ సుంకాలకు వెరవకుండా జిన్‌పింగ్ ప్రతిసుంకాలు వేశారు. చివరకు అక్టోబరులో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరింది. బోయింగ్ విమానాలతో పాటు సోయాబీన్ సహా పలు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చైనాను ఒప్పించడంపై శిఖరాగ్ర సదస్సులో అమెరికా దృష్టిపెట్టొచ్చు.
ఇవి కూడా చదవండి
