నరకాలతో పోల్చిన ట్రంప్… నాగరికతల పుట్టినిలన్న ఇరాన్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. ఒక్కోసారి విచక్షణ కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తనకు ఏదనిపిస్తే అది మాట్లాడడం.. తన మనస్సుకు అనిపించింది ఎవరైనా చెబితే, వారిని హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసించడం.. ఫెంటాస్టిక్ అని పొగడడం ట్రంప్ కు మాత్రమే చెల్లింది. గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇంత అపరిపక్వంగా వ్యవహరించలేదు. గతంలో ఒబామా, క్లింటన్, బుష్ లాంటి హేమాహేమీలు .. అధ్యక్షులుగా వ్యవహరించారు. చాలా ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడేవారు. వారు ఒక్క సంకేతమిస్తే చాలు.. ప్రత్యర్థి దేశాలు, మిత్రులు అలర్ట్ అయ్యేవారు. కానీ ట్రంప్ మాత్రం అలా కాదు. కోపమొస్తే చాలు.. ఎంతటి అభ్యంతరకర భాష అయినా మాట్లాడేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
లేటెస్టుగా ట్రంప్.. అలాంటి పోస్టును రీపోస్టు చేశారు. భారత్, చైనా సహా ఇతర దేశాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో హోస్ట్ మైఖెల్ సావేజ్ షేర్ చేసిన లేఖను ట్రంప్ రీపోస్ట్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం మొదలైంది.
‘‘ఆసియా దేశాల నుంచి మహిళలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డకు జన్మనిస్తారు. ఇక్కడ ఉన్న చట్టాలేమో ఆ బిడ్డకు వెంటనే అమెరికా సిటిజన్షిప్ ఇస్తాయి. ఆ తర్వాత వారు తమ కుటుంబసభ్యులందరినీ చైనా, భారత్ (India-China) లేదా మరేదైనా నరకం నుంచి ఇక్కడికి తీసుకొస్తారు’’ అంటూ జన్మతః పౌరసత్వం (Birthright Citizenship)పై మైఖెల్ షేర్ చేసిన ఒక లేఖను ట్రంప్ (Donald Trump) రీపోస్టు చేసిన సంగతి తెలిసిందే.
దీనికి ఇరాన్ కౌంటర్ ఇస్తూ.. ‘‘భారత్, చైనాలు మహోన్నత నాగరికతలకు పుట్టినిళ్లు. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తామని ఒక యుద్ధ నేరస్థుడైన అధ్యక్షుడు చెప్పడమే అసలైన నరకం’’ అని విమర్శించింది. ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని గతంలో ట్రంప్ హెచ్చరికలు చేసిన తెలిసిందే. ఆ బెదిరింపులను ఉద్దేశించే తాజా స్పందన వచ్చింది.
భారత, చైనా (China) నాగరికతలు ప్రపంచంలోనే పురాతన, సజీవ నాగరికతలు. 4వేల ఏళ్లనాటి చరిత్ర, సంస్కృతి ఈ దేశాల సొంతం. ఈజిప్టు, మెసొపొటేమియా వంటి నాగరికతలు అంతమైనా భారత్, చైనా నాగరికతలు సింధు, హొయాంగ్ హో నది (యల్లో రివర్) ఒడ్డున విస్తరించాయి. ఈ రెండూ వేర్వేరు భౌగోళిక పరిస్థితుల్లో విలసిల్లినా.. ఆసియా చరిత్రపై బలమైన ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలు బలమైన ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్నాయి. అలాగే ఇరాన్ నాగరికత (పర్షియా) కూడా పురాతనమైనదే. అదే అమెరికా (USA) విషయానికొస్తే.. 1776లో ఏర్పడింది. అంటే దాని చరిత్ర పట్టుమని 250 ఏళ్లే.
ఇవి కూడా చదవండి
