శూర్పణఖగా రకుల్ బిజీబిజీ
బాలీవుడ్లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మైథలాజికల్ డ్రామా రామాయణ(Ramayana) గురించి మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్లో ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) ఇప్పుడు పూర్తిగా హిందీ సినిమాలపైనే దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ సినిమాలోకీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె శూర్పణఖ పాత్రను పోషిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆమెకు సంబంధించిన లుక్ టెస్ట్ పూర్తి కాగా, ఇటీవల ముంబైలో జరుగుతున్న తాజా షెడ్యూల్లో షూటింగ్లో కూడా పాల్గొన్నట్లు తెలిసింది.
ఇక ఈ భారీ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్(Yash) రావణుడి పాత్రలో కనిపించనుండగా, ప్రస్తుతం ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) శ్రీరాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి(Sai Pallavi) సీత పాత్రలో ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్లు, క్యాస్టింగ్ వివరాలు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచాయి. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
దంగల్ ఫేమ్ నితేష్ తివారీ(Nitesh Tiwari) ఈ మైథలాజికల్ ఎపిక్‌ను తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా(Namit Malhotra) నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రామాయణ తొలి భాగం షూటింగ్ పూర్తయిందని, ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం. రెండో భాగం షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతుండగా, 2027 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
