గతంలోకి తీసుకెళ్ళిన ‘తిమ్మరాజుపల్లి TV’
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థలు : కే ఏ ప్రొడక్షన్స్ మరియు సుమైర స్టూడియోస్
నటీనటులు : సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి,
అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు నటించారు
ఛాయాగ్రహణం : అక్షయ్ రామ్ పొదిశెట్టి, సంగీతం : వంశీకాంత్ రేఖన
కళా దర్శకుడు : సుధీర్ మాచర్ల, సి ఈ ఓ: రహస్య కిరణ్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కేఎల్ మదన్
సహా నిర్మాత – తేజ వేల్పుచర్ల, నిర్మాత: కిరణ్ అబ్బవరం
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి. మునిరాజు
విడుదల తేది :17.04.2026
నిడివి :2 ఘంటల 04 నిముషాలు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) పూర్తిస్థాయి నిర్మాతగా మారి,అంతా కొత్తవాళ్ళని పెట్టి ‘తిమ్మరాజుపల్లి TV’(Thimmaraju Palli TV) అనే చిత్రాన్ని నిర్మించాడు. తాను హీరోగా చేసిన సినిమాలని ఏ రేంజ్లో ప్రమోట్ చేస్తుంటాడో.. కొత్త వాళ్ళతో చేసిన ఈ ‘తిమ్మరాజుపల్లి TV’ని కూడా అదే రేంజ్లో ముందుండి ప్రమోట్ చేశాడు కిరణ్ అబ్బవరం. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా… వి మునిరాజు (V Muni Raju)దర్శకుడిగా పరిచయం అయ్యారు. సుమారు 40 మందిని ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశారు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాపై మొదటి నుండి ఆడియన్స్ దృష్టి పడింది. మరి నిర్మాతగా వేసిన ఈ తొలి అడుగు కిరణ్ అబ్బవరంకి ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలుసుకుందాం. టీవీ నేపథ్యంలో పల్లెటూరి కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా వుందో సమీక్షలో చూద్దాం ?
కథ :
1990ల టైంలో ఈ కథ జరుగుతుంది. కుప్పం సమీపంలోని ఓ గ్రామం తిమ్మరాజుపల్లి అనే ఓ చిన్న ఊరు. పండుగల టైంలో ఆ ఊర్లో జనాలంతా చందాలు వేసుకుని ఓ గుడి వద్దకు టీవీని అద్దెకు తెచ్చుకుంటారు.వీసీఆర్ సదుపాయంతో కొత్త సినిమాలు వేసుకుని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడికి టీవీ అద్దెకు తెచ్చేది సత్తి అలియాస్ సతీష్(సాయి తేజ్). టీవీల ఓనర్ల వద్ద కమిషన్ తీసుకోవడంతో పాటు… తన సరదాల కోసం ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు సతీష్. అదే ఊరికి చెందిన రాజప్ప(ప్రదీప్ కొట్టే) చెల్లెలు శారద, సతీష్ గాఢంగా ప్రేమించుకుంటారు. తర్వాత రాజప్ప పెళ్లి అవుతుంది. కట్నం డబ్బులతో ఓ టీవీని, డిష్ ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటాడు. దీంతో ఆ ఊర్లోని జనాలు అంతా రోజూ రాజప్ప ఇంటికి వచ్చి టీవీ చూస్తుంటారు. కానీ కొత్తగా పెళ్ళైన రాజప్పకి ప్రైవసీ కరువవ్వుతుంది. రాజప్ప ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు.. చెల్లెలు ప్రేమ వ్యవహారం అతని తండ్రికి తెలుస్తుంది. దీంతో సతీష్ తో గొడవకి దిగుతాడు రాజప్ప తండ్రి. ఈ క్రమంలో.. సతీష్ పై చేయి చేసుకుంటాడు రాజప్ప. సతీష్ కూడా తగ్గకుండా రాజప్ప పై మాటల యుద్దానికి దిగుతాడు. ఆ గొడవ తర్వాతి రోజు రాజప్ప ఇంట్లో టీవీ దొంగిలించబడుతుంది. దానికి తోడు సతీష్ పై కూడా దాడి జరుగుతుంది. ఊరికి మొదటి టీవీ తీసుకు రావాలని కలలు కన్న సర్పంచ్ రామచంద్రయ్య (అమ్మ రమేష్) ఏం చేశాడు? ఇవి చేసింది ఎవరు? టీవీ ఏమైంది? అనేది మిగిలిన కథ.
ఇవి కూడా చదవండి
నటీ నటుల హవబావాలు :
హీరో సాయి తేజ్ లుక్, డైలాగ్ మాడ్యులేషన్ బాగుంది. తన పాత్రకి అతను పూర్తి న్యాయం చేశాడు. అయితే ఇతని కంటే రాజప్ప పాత్ర చేసిన ప్రదీప్ కొట్టే కి ఎక్కువ మార్కులు పడతాయి. తన పాత్రలో జీవించేశాడు ప్రదీప్. అతని భార్య ఎల్లమ్మ పాత్రలో స్వాతి కూడా బాగా చేసింది. శారద పాత్ర చేసిన వేద జలంధర్ లుక్స్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసింది. అమ్మ రమేష్, సత్య నారాయణ వంటి వారు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా బాగా చేశారు
సాంకేతిక వర్గం పనితీరు :
నోస్టాల్జియా మూమెంట్స్ చక్కగా క్యాప్చర్ చేసి ‘తిమ్మరాజుపల్లి TV’ కథని డిజైన్ చేసుకున్నాడు చేశారు దర్శకుడు మునిరాజు. రూటెడ్ కథలకి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. నిజమే 90ల టైంలో ప్రతి ఇంటికి టీవీ ఉండేది కాదు. పది ఇళ్ళకి ఒక్క టీవీ అన్నట్టు ఉండేది. ఊర్లల్లో ఉండే జనాలు.. సాయంత్రమైతే చాలు టీవీ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, వాళ్ళు టీవీ కట్టే వరకు అక్కడే ఉండిపోయేవారు. ఆ సమయాల్లో టీవీ ఉన్న ఇంట్లో వాళ్ళ ప్రైవసీకి ఇబ్బందులు కలిగేవి, దీంతో అక్కడికి వచ్చే జనాలపై నోరు పారేసుకుని గొడవలు పెట్టుకునే వారు. క్లైమాక్స్ లో ట్విస్టులు బాగున్నాయి. పాటలు బాగున్నాయి. కానీ అంతా కొత్త వాళ్ళతో ఇలా క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడం అనేది కూడా ఇప్పుడు గొప్ప విషయమే. సౌండింగ్ కూడా క్వాలిటీగా అనిపించింది. విజువల్స్ కూడా బాగున్నాయి. సహజత్వానికి దగ్గరగా తీశారు. ఆ విషయంలో వంశీకాంత్ రేఖన సంగీతం, అక్షయ్ రామ్ పొడిశెట్టి ఛాయాగ్రహణం ప్రధాన పాత్ర పోషించాయి. కథంతా 1990వ దశకం నేపథ్యంలో సాగడంతో… కామెడీకి బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్ చేసిన మేజిక్ కారణంగా థియేటర్లలోకి వెళ్లిన కాసేపటికి తిమ్మరాజుపల్లిలోకి, ఆ కాలంలోకి ప్రేక్షకులు వెళతారు. కొత్త వాళ్ళందరూ కలిసి చేసిన ప్రయత్నాన్ని అభినందించవచ్చు. ఇక కిరణ్ అబ్బవరం నిర్మాణ విలువలు టెక్నికల్ టీం సినిమాకి బాగా కష్టపడ్డారు.
విశ్లేషణ :
ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరి అర చేతిలో స్మార్ట్ ఫోన్, ట్యాబ్స్, ల్యాప్ టాప్స్ ఉంటున్నాయి. ప్రపంచ ప్రజలకు 24/7 కావలసినంత వినోదం అందుతోంది. ఓ 30 ఏళ్ళు వెనక్కీ వెళితే… ఫోన్ కాదు కదా, కొన్ని పల్లెటూళ్లలో కనీసం టీవీ కనిపించేది కాదు. కొన్ని పల్లెల్లో అయితే ఊరికి ఒక్క టీవీ ఉండేది. ఆ ఊరి జనమంతా ఆ టీవీ ముందు కనిపించేవారు. ఆ పాయింట్ మీద తీసిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. కథంతా 1990వ దశకం నేపథ్యంలో సాగింది. కథలో నోస్టాల్జియా మూమెంట్స్ ఉండటం కాదు… ఆ నోస్టాల్జియాలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఆ విషయంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ బృందం విజయం సాధించింది. దర్శకుడు వి మునిరాజు సింపుల్ పాయింట్ తీసుకున్నారు. ఓ పల్లెను తెరపై బాగా ఆవిష్కరించారు. చిత్తూరు నేపథ్యం తీసుకోవడం కథకు ప్లస్ అయ్యింది. ప్రారంభం నుంచి కొత్తగా కనిపిస్తుంది. టీవీ కోసం ఊరంతా చందాలు వేసుకోవడం, ఊరిలో ఒకరు టీవీ కొనడంతో వాళ్ళింటికి అందరూ చేరుకోవడం, చిన్న చిన్న గొడవలు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథతో ప్రథమార్థం సరదాగా సాగుతుంది. మదర్ & సన్ సెంటిమెంట్ సైతం వర్కవుట్ అయ్యింది. టీవీ మాయం అయినప్పటి నుంచి కథలో సీరియస్నెస్ పెరుగుతుంది. టీవీ కోసం జరిగే అన్వేషణ ఆసక్తిగా సాగింది. అయితే… కథను ముగించిన తీరు కొంత అసంతృప్తికి గురి చేస్తుంది. క్లైమాక్స్ ఇంకా మంచిగా రాసి ఉండొచ్చని, తీసి ఉండొచ్చని అనిపిస్తుంది. కథ కాస్త కిందకు మీదకు పడుతూ లేస్తూ వెళ్లినట్టు అనిపించినా… సరదాగా రెండు ఘంటల పాటు పల్లెలోకి వెళ్లి వచ్చినట్టు ఉంటుంది.
ఇవి కూడా చదవండి
