రోబో 2.0 తర్వాత మరోసారి రిస్క్ చేస్తున్న రజినీ
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కెరీర్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్‌లలో జైలర్2(Jailer2) ఇప్పుడు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సెప్టెంబర్ 4 రిలీజ్ టార్గెట్‌గా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయనే సమాచారం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తన కెరీర్ మొత్తం సీక్వెల్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించిన రజినీకాంత్, ఈసారి మాత్రం జైలర్ ఫ్రాంచైజ్ కొనసాగింపుకు అంగీకరించడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో బాషా(baasha), పడయప్ప(Padayappa) వంటి కల్ట్ హిట్స్ సీక్వెల్స్‌కు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు జైలర్ 2పై చూపుతున్న నమ్మకం వెనుక డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dilipkumar) విజన్ కీలక కారణమని టాక్ వినిపిస్తోంది.
బీస్ట్(Beast) తర్వాత విమర్శలు ఎదుర్కొన్న నెల్సన్‌కు అవకాశం ఇచ్చి జైలర్‌తో భారీ బ్లాక్‌బస్టర్ అందించిన రజనీ, అదే కాంబినేషన్‌ను మరోసారి కొనసాగించేందుకు ముందుకొచ్చారు. ఈసారి కథ పూర్తిస్థాయి కొనసాగింపుగా కాకుండా టైగర్ ముత్తువేల్ పాండియన్(Tiger Muthuvel pandiyan) గత జీవితాన్ని చూపించే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోందనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. దీంతో జైలర్ 2లో ప్రీక్వెల్ టచ్ కూడా ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎస్జే సూర్య(SJ Suryah) మెయిన్ విలన్ గా నటిస్తుండగా, మోహన్‌లాల్(Mohanlal), శివరాజ్‌కుమార్(Shiva Rajkumar) క్యామియోలు సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మరింత బజ్ తీసుకొస్తున్నాయి.
ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. బాహుబలి2(Baahubabli2), కేజీఎఫ్ 2(KGF2), పుష్ప 2(Pushpa2) వంటి సినిమాల సక్సెస్‌లతో రెండో భాగాలపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఏర్పడింది. అదే మార్గంలో ఇప్పుడు రజినీకాంత్ కూడా అడుగుపెడుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రోబో 2.0(RObo 2.0) తర్వాత మరోసారి సీక్వెల్ రిస్క్ తీసుకుంటున్న రజనీకి జైలర్ 2 కొత్త రికార్డులు తీసుకొస్తుందా? లేక అంచనాల భారాన్ని మోయలేకపోతుందా? అన్న చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
