Donald Trump: బానిసల పిల్లల కోసమే ఆ చట్టం.. పౌరసత్వ హక్కుపై ట్రంప్ క్లారిటీ!
Donald Trump: అమెరికా పౌరసత్వ నిబంధనలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిప్పులు చెరిగారు. అమెరికాలో పుట్టిన వారందరికీ సహజంగా లభించే ‘బర్త్‌రైట్ సిటిజన్‌షిప్’ (Birthright Citizenship) చట్టాన్ని సంపన్న విదేశీయులు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై ఏప్రిల్ 1న సుప్రీంకోర్టు విచారణ జరగనున్న నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ వాదన ఇదే:
చైనా వంటి ఇతర దేశాలకు చెందిన ధనవంతులు తమ పిల్లలకు అగ్రరాజ్య పౌరసత్వం ఇప్పించుకోవడానికి ఈ చట్టాన్ని తీసుకురాలేదని ట్రంప్ స్పష్టం చేశారు. 1865లో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత, కేవలం బానిసల పిల్లలకు రక్షణ కల్పించే ఉద్దేశంతోనే దీనిని ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. “ప్రపంచ దేశాలలోని సంపన్నులు మన ప్రయోజనాలను వాడుకుంటూ ఎదుగుతున్నారు. మన విఫలమైన న్యాయవ్యవస్థను చూసి వారు నవ్వుకుంటున్నారు” అంటూ ట్రంప్ ఘాటుగా విమర్శించారు.
కారణాలు:
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. తల్లిదండ్రులు ఏ దేశస్థులైనా సరే, అమెరికా గడ్డపై జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభిస్తుంది. అయితే, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఈ హక్కును రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కోర్టుల్లో సవాళ్లు ఎదురవడంతో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బుధవారం (ఏప్రిల్ 1) నాడు ఈ కీలక అంశంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు అటు న్యాయ వర్గాల్లో, ఇటు వలసదారుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
