భారత్ కు రష్యా చమురు అండ..!
భారత్ కు మరోసారి అండగా నిలిచింది మిత్రదేశం రష్యా. భారత ఇంధన అవసరాలను తీరుస్తామంది.ఇంధన సరఫరాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ నెరవేరుస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు స్నేహంపై ఆధారపడి ఉన్నాయని.. వాటి దారులు వేరయ్యే పరిస్థితి ఏమాత్రం ఉండదని చెప్పారు. త్వరలో భారత్ పర్యటనకు రానున్న వేళ లావ్రోవ్ .. తాజా పరిణామాలపై స్పందించారు.
ప్రపంచం చూసిన శక్తిమంతమైన నాయకుల్లో ప్రధాని మోడీ (PM Modi) ఒకరన్నారు లావ్రోవ్. ఆర్థిక వ్యవస్థ, సైన్యం, సంస్కృతి.. ఇలా అన్ని రంగాల్లో భారత్ సార్వభౌమాధికారాన్ని సాధించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి
‘‘ఇంధన సరఫరాల బాధ్యతలను నెరవేర్చడంలో రష్యా (Russia) ఎన్నడూ విఫలం కాలేదు. ఈ విషయంలో భారత ప్రయోజనాలకు ఎటువంటి నష్టం జరగనివ్వం. చమురు సరఫరాలో ఆటంకం రానివ్వం. అన్యాయమైన, నిజాయతీ లేని పోటీ మార్కెట్.. ఇరుదేశాల మధ్య ఒప్పందాలను దెబ్బతీయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం కోసం కొత్త పవర్ యూనిట్ల నిర్మాణంలో మా సహకారం కొనసాగుతోంది. భారత అవసరాల దృష్ట్యా గ్యాస్, చమురు, బొగ్గు వంటివి సరఫరా చేస్తూనే ఉంటాం. భారత్- రష్యా సంబంధాలను బలహీనపరిచేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాల పట్ల అప్రమత్తత అవసరమన్నారు.
‘హిందీ- రూసీ భాయ్ భాయ్’ (భారతీయులు- రష్యన్లు సోదరులు) అనేది సరదా నినాదం మాత్రమే కాదు. అది మన సంస్కృతిలో భాగం. భారతీయ సినిమాలు, రాజ్ కపూర్, టెలివిజన్ సిరీస్‌లు ఇవన్నీ రష్యాలో ప్రతిచోటా ప్రజాదరణ పొందాయి. ఆర్థిక వ్యవస్థ, సైనిక సహకారం, ఇంధన సరఫరాలు, సాంస్కృతిక- మానవతా సంబంధాల వంటి అనేక అంశాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు దృఢంగా ఉన్నాయి’’ అని లావ్రోవ్ అన్నారు. భారత పర్యటన సందర్భంగా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో లావ్రోవ్ చర్చలు జరపనున్నారు. ‘బ్రిక్స్’ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరు కానున్నారు.
ఇవి కూడా చదవండి
