శ్రీశైలంలో సైబర్ పంజా.. ఢిల్లీ యాత్రికులకు టోకరా..!
పావన పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో(SriSailam) భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. స్వామివారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఒక యాత్రికుల బృందాన్ని మల్లికార్జున సదన్(Mallikharjun Sadan) పేరుతో బురిడీ కొట్టించి వేల రూపాయలు కాజేశారు. ఆధ్యాత్మిక యాత్ర కోసం వచ్చిన భక్తులు తీరా క్షేత్రానికి చేరుకున్నాక తాము మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన 27 మంది యాత్రికులు ఒక బృందంగా ఏర్పడి హైదరాబాద్ నుండి టూరిస్ట్ బస్సులో శ్రీశైలం చేరుకున్నారు. వీరంతా యాత్రకు ముందే వసతి కోసం ఆన్లైన్లో వెతకగా, ‘మల్లికార్జున సదన్’ పేరుతో ఉన్న ఒక నకిలీ వెబ్సైట్ కనిపించింది. దాన్ని నిజమని నమ్మిన భక్తులు, అందులో ఉన్న ఫోన్ నంబర్లను సంప్రదించి 9 ఏసీ గదుల కోసం ముందస్తుగా రూ. 15,000 చెల్లించారు. డిజిటల్ పేమెంట్ ద్వారా నగదు పంపిన తర్వాత తమకు గదులు ఖాయమయ్యాయని వారు భావించారు.
అయితే, శ్రీశైలం చేరుకున్న తర్వాత మల్లికార్జున సదన్ వద్దకు వెళ్లి గదుల కోసం అడగగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాము ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లు భక్తులు రశీదులు చూపించగా, అవి నకిలీవని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పారు. అసలు తమ సదన్ పేరుతో ఎలాంటి ఆన్లైన్ బుకింగ్స్ ఉండవని చెప్పడంతో యాత్రికులు అవాక్కయ్యారు. మోసపోయినట్లు గుర్తించిన భక్తులు అధికారులను ఆశ్రయించారు. పుణ్యక్షేత్రాలకు వచ్చే వారు కేవలం దేవస్థాన అధికారిక వెబ్సైట్ల ద్వారానే గదులు బుక్ చేసుకోవాలని, గూగుల్లో దొరికే ప్రైవేట్ నంబర్లను నమ్మి డబ్బులు పంపవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
