బండి భగీరథ్ పై బాధితురాలి తల్లి సంచలన ప్రకటన
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అంశంపై తాజాగా బాధితురాలి తల్లి విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆమె వెల్లడించిన అంశాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
కేంద్ర మంత్రి కుమారుడి చేతిలో మోసపోయామని, ప్రాణ భయంతో బతుకుతున్నామని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె విడుదల చేసిన బహిరంగ లేఖ ఇప్పుడు ఈ కేసును మరో మలుపు తిప్పింది. తమది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబమని, రాజకీయ అండదండలు ఉన్న వ్యక్తులతో పోరాడలేక వ్యవస్థల ముందు మోకరిల్లుతున్నామని ఆమె పేర్కొన్నారు.
తల్లి ప్రకటన ప్రకారం.. 2025లో బండి భగీరథ్‌తో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. మొదట్లో సాధారణంగా సాగిన ఈ పరిచయం, ఆ తర్వాత ప్రలోభాలు, ఒత్తిడితో కూడిన సంబంధంగా మారింది. తన కుమార్తెను మాయమాటలతో లొంగదీసుకుని, పూర్తిగా భగీరథ్ తన నియంత్రణలోకి తెచ్చుకున్నారని ఆమె ఆరోపించారు.
ముఖ్యంగా 2025 డిసెంబర్ 31 రాత్రి, 2026 జనవరి 1 తెల్లవారుజామున మోయినాబాద్ ప్రాంతంలో తన కుమార్తెపై భగీరథ్ శారీరక దాడికి పాల్పడ్డారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం సేవించాలని ఒత్తిడి చేసి, అచేతన స్థితిలో ఉన్న బాలికపై అఘాయిత్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా పదేపదే శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చారని ఆమె వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
న్యాయం కోసం తాము పడ్డ కష్టాలను వివరిస్తూ.. 2026 ఏప్రిల్ 23న కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి వెళ్ళినట్లు ఆమె తెలిపారు. భగీరథ్ ప్రతినిధిగా చెప్పుకునే సంగప్ప అనే వ్యక్తి సూచన మేరకు అక్కడికి వెళ్తే, తమకు భరోసా లభిస్తుందని ఆశించామని, కానీ దానికి భిన్నంగా అక్కడ తమకు బెదిరింపులే ఎదురయ్యాయని ఆమె ఆరోపించారు. మంత్రితో భేటీ తర్వాత తీవ్రమైన ప్రాణ భయంతో బయటకు వచ్చామని, తమ కుటుంబానికి హాని తప్పదని హెచ్చరించారని ఆమె పేర్కొన్నారు.
ఈ నెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించినప్పుడు కూడా తమకు చేదు అనుభవమే ఎదురైందని బాధితురాలి తల్లి తెలిపారు. మైనర్ అని చెప్పినప్పటికీ గంటల తరబడి స్టేషన్లో నిరీక్షించేలా చేశారని, జూరిస్డిక్షన్ సాకులు చెప్పి కేసు నమోదులో జాప్యం చేశారని ఆరోపించారు. చివరకు ‘జీరో ఎఫ్ఐఆర్’ కోసం పట్టుబట్టిన తర్వాతే పోలీసులు స్పందించారని ఆమె వెల్లడించారు. మొదట బెయిల్ వచ్చే సెక్షన్లే పెట్టినప్పటికీ, ప్రజాగ్రహం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు తర్వాతే కఠిన సెక్షన్లు నమోదు చేశారని ఆమె గుర్తు చేశారు.
ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండి స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, మరోవైపు సోషల్ మీడియాలో తన కుమార్తె వయసుపై, గుర్తింపుపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తల్లి వాపోయారు. న్యాయ విచారణను తప్పుదోవ పట్టించడానికే బాలిక పుట్టిన తేదీపై వివాదాలు సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
మా బిడ్డకు జరిగిన అన్యాయం మరే బిడ్డకు జరగకూడదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు ఇప్పుడు ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు సవాలుగా మారింది. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా మైనర్ బాలికకు న్యాయం జరగాలని, నిందితుడు ఎంతటి బలవంతుడైనా కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు బండి భగీరథ్ ఇంకా పరారీలోనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి






