ఐఆర్జీసీని టార్గెట్ చేసిన అమెరికా.. ఆర్థిక మూలాలు చెబితే రూ.145 కోట్లు ఆఫర్..!
పశ్చిమాసియా యుద్ధం వీలైనంత వేగంగా ముగించాలి. అగ్రరాజ్యం అనే హోదాను శాశ్వతంగా నిలబెట్టుకోవాలి. ప్రపంచదేశాల ముందు సగర్వంగా తలఎత్తుకునేలా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే తమ ఆదేశాలు లేదా షరతులను ఇరాన్ అంగీకరించాలి. తమ ముందు ఓడిపోయామని తల దించుకుని నిలబడాలి. కానీ టెహ్రాన్ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. యుద్ధమైనా, చర్చలైనా ధీటుగా స్పందిస్తోంది. దీంతో యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది అమెరికా.
యుద్ధాన్ని ముగించడానికి వాషింగ్టన్ చేసిన ప్రతిపాదనలను టెహ్రాన్ అంగీకరించకపోవడంతో ఒప్పందం మరింత ఆలస్యమవుతోంది. ఈక్రమంలో అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఐఆర్జీసీ (IRGC) ఆర్థిక మూలాలు చెప్పిన వారికి రూ.145 కోట్ల వరకు బహుమతిగా ఇస్తామని బహిరంగంగా ఆఫర్ చేసింది.
ఇవి కూడా చదవండి
ఐఆర్జీసీ.. దాని సంబంధిత శాఖలకు కీలక ఆర్థిక వనరులను అందించే బినామీ కంపెనీలు, వ్యక్తులు, ఆర్థిక సంస్థల సమాచారాన్ని తమకు తెలియజేయాల్సిందిగా కోరింది. గల్ఫ్ దేశాలపై దాడులు చేయకుండా.. అణు కార్యక్రమాలు చేపట్టకుండా ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
యుద్ధం ముగించేందుకు ఉపయోగపడే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఏవిధమైన దురాక్రమణకైనా తగిన గుణపాఠం చెప్పేందుకు తమ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తప్పుడు అంచనాలు.. తప్పుడు నిర్ణయాలతో కూడిన వ్యూహం ఎల్లప్పుడూ తప్పుడు ఫలితాలనే ఇస్తుందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రపంచమంతా అర్థం చేసుకుందన్నారు. అమెరికాతో చర్చల్లో భాగంగా తాము ప్రతిపాదించిన అంశాలను అంగీకరించడం తప్ప అమెరికాకు మరో ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు.
మళ్లీ ఇరాన్ క్షిపణి కార్యక్రమాలు
యుద్ధంలో ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నా.. అగ్రరాజ్య నిఘా వర్గాలు మాత్రం అందుకు వ్యతిరేకమైన ఆధారాలను బహిర్గతం చేశాయి. హర్మూజ్ జలసంధికి సమీపంలో ఇరాన్‌కు ఉన్న 30 స్థావరాల్లో తిరిగి క్షిపణుల తయారీ తిరిగి ప్రారంభం అయిందని పేర్కొన్నాయి . ఆ దేశంలోని దాదాపు 90శాతం భూగర్భ క్షిపణి సౌకర్యాలు మళ్లీ ప్రారంభమైనట్లు తెలిపాయి..






