IND v sSA: టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు షాక్.. దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం!
టీ20 ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా (INDvsSA) జోరుకు బ్రేక్ పడింది. సూపర్-8 రౌండ్లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన కీలక పోరులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమితో టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ సేన తొలి పరాజయాన్ని చవిచూడటమే కాకుండా, నెట్ రన్‌రేట్ దెబ్బతినడంతో సెమీస్ రేసులో నిలవాలంటే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాల్సిన క్లిష్ట పరిస్థితిని కొనితెచ్చుకుంది.
బౌలర్ల పట్టు చేజారి.. భారీ స్కోరు..
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా (INDvsSA) తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు బుమ్రా, అర్ష్‌దీప్ ఆరంభంలోనే నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికాను వణికించారు. కేవలం 20 పరుగులకే డికాక్ (6), రికెల్టన్ (7), మార్క్రమ్ (4) వికెట్లు తీసి భారత్ పట్టు బిగించింది. అయితే ఈ ఆధిపత్యాన్ని మన బౌలర్లు ఎక్కువసేపు కొనసాగించలేకపోయారు. డేవిడ్ మిల్లర్ (63), యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ (45) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకున్నారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్) మెరుపులు తోడవడంతో దక్షిణాఫ్రికా (INDvsSA) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 3, అర్ష్‌దీప్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇవి కూడా చదవండి

విలవిలలాడిన భారత బ్యాటింగ్..
అనంతరం 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా (INDvsSA) బ్యాటింగ్ విభాగానికి ఇది ఒక పీడకలలా మిగిలిపోయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ సున్నాకే వెనుదిరగ్గా.. గత మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ (15) ఈసారి ఖాతా తెరిచినా ఎక్కువ సేపు నిలవలేదు. తిలక్ వర్మ (1), కెప్టెన్ సూర్య (18), హార్దిక్ పాండ్యా (18), రింకు సింగ్ (0) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక దశలో 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. శివమ్ దూబె (42) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ జట్టును (INDvsSA) ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి అవతలి వైపు నుంచి సహకారం అందలేదు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ మాయాజాలానికి భారత మిడిలార్డర్ కుప్పకూలింది. దీంతో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా (INDvsSA) బౌలర్లలో మార్కో జాన్సెన్ 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా, మహరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి