Facial Recognition: అక్రమాలపై టీటీడీ టెక్ అస్త్రం..!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజూ లక్షలమంది భక్తులు తరలివస్తారు. వారందరికీ శ్రీవారి దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే దైవ దర్శనం కోసం రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడుతుంటారు. అయితే ఇలాంటి సమయాన్ని తమకు అనువుగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు దళారులు. సులభంగా శ్రీవారి దర్శనం చేయిస్తామంటూ భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు కూడా. దీని వల్ల సామాన్య భక్తుడికి అన్యాయం జరుగుతోంది. అయితే దీన్ని సరిదిద్దేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నాలు చేస్తోంది.
తిరుమలలో దళారుల మోసాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కేటాయింపులో అక్రమాలను నిరోధించేందుకు ఆధార్‌తో పాటు ఫేస్ రికగ్నిషన్, ఆధార్ నిర్ధారణ వ్యవస్థలను తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నా, కొందరు దళారులు వాటిని కూడా మార్ఫింగ్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించడంతో ఈ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది.
దీనికి గానూ టీటీడీ.. యూఐడీఏఐ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇటీవల టీటీడీ, యూఐడీఏఐ అధికారుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. టీటీడీకి తమ సేవలు అందించేందుకు యూఐడీఏఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా టీటీడీ ఏయూఏ (అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ)గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రెండేళ్ల కాలానికి రూ.20 లక్షలు చెల్లించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే, ప్రతి ఆధార్ నిర్ధారణ లావాదేవీకి 4 పైసలు, ఈ-కేవైసీకి రూ.3.40 చొప్పున యూఐడీఏఐకి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూఐడీఏఐ సేవలను వినియోగించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్ పొందేందుకు టీటీడీ ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే, తిరుమలలో దళారుల ప్రమేయానికి పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
