రంజింపచేసిన రాధాకృష్ణ అకాడమీ నృత్యార్చన
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్నం 100మందికి పైగా భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ జరిగింది. అనంతరం సాయంత్రం యథావిధిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అన్నమయ్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి)తో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.
అనంతరం రాధా కృష్ణ అకాడమీ గురువు విజయ రామరాజు గారి మార్గదర్శకత్వంలో శిష్యులు స్వామి వారికి భక్తిపూర్వకంగా నృత్యార్చన సమర్పించారు.
ఈ కార్యక్రమంలో నవ్య, మానస, చరణి, భవిత, తేజస్విని, అనన్య, పూర్ణిత, ఉష, శ్రీశుత, కుష్మిత, లహరి, ఉమ, తరుణి, శ్రీహిత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా “ఆలోకయే శ్రీ బాల కృష్ణ” అనే సంకీర్తనకు నవ్య, మనస డ్యూయెట్ నృత్యాన్ని భక్తి శ్రద్ధలతో ప్రదర్శించి కార్యక్రమానికి మధురమైన అనుభూతి ఇచ్చారు.
అలాగే “చక్కని తల్లికి చాంగు భళా” అనే సంకీర్తనకు నవ్య, మానస, చరణి, శ్రీశుత, అనన్య, తేజస్విని, ఉష, తరుణి, భవితలు సమిష్టిగా నృత్యాన్ని ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు.
తదుపరి “గరుడ గమన తవ” మరియు “ఆత్మరామ ఆనంద రమణ” అనే సంకీర్తనలకు కుష్మిత, శ్రీహిత, లహరి, ఉమ, పూర్ణితలు సంయుక్తంగా భావాభినయంతో నృత్యాన్ని సమర్పించి నృత్యార్చనకు మరింత శోభను చేకూర్చారు.

శిష్యుల నృత్యాలు లయ, భావ, భంగిమ, అభినయ సమన్వయంతో సాగి విచ్చేసిన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు గారు ఒక అన్నమయ్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, గురువు విజయ రామరాజు గారు తమ శిష్యులను భక్తి శ్రద్ధలతో తీర్చిదిద్దుతున్న విధానం ప్రశంసనీయం అని అభినందించారు.
తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు పాల్గొన్న శిష్యులకు శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందించి సత్కరించారు.
చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో ఈ శనివారం అన్నమయ్యపురంలో జరిగిన అన్నదానం – పారాయణం – నృత్యార్చన కార్యక్రమం భక్తి, నృత్య మాధుర్యంతో విజయవంతంగా ముగిసింది.