ఈ కారు కొంటే ఏకంగా రూ. 75 లక్షలు ఆదా.. ఎగబడుతున్న ధనవంతులు!
లగ్జరీ కారు అనగానే ఆటోమొబైల్ ప్రియులకు ముందుగా గుర్తొచ్చే పేర్లలో ‘రేంజ్ రోవర్’ (Range Rover) ఒకటి. సినీ సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు మాత్రమే కొనుగోలు చేయగలిగే ఈ కారు ధరలు ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటాయి. కానీ విలాసవంతమైన కార్లను ఇష్టపడే వారికి ఈ బ్రాండ్ కళ్లుచెదిరే శుభవార్త చెప్పింది. ఏకంగా ఒక కారుపై రూ. 75 లక్షల మేర భారీ తగ్గింపును ప్రకటించి భారత ఆటోమొబైల్ మార్కెట్లో పెను సంచలనం సృష్టించింది. ప్రముఖ బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘జాగ్వార్ ల్యాండ్ రోవర్’ (JLR India) ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి
ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే..
ధరల సవరణ తర్వాత గణాంకాలను చూస్తే సామాన్యుల దిమ్మతిరగడం ఖాయం. కంపెనీకి చెందిన ఫ్లాగ్షిప్ మోడల్ అయిన ‘రేంజ్ రోవర్ ఎస్వీ’ (Range Rover SV) కారు ధర మునుపటి కంటే ఏకంగా రూ. 75 లక్షలు దిగివచ్చింది. గతంలో దీని ధర రూ. 4.25 కోట్లుగా ఉండగా.. తాజా తగ్గింపుతో అది రూ. 3.5 కోట్లకు చేరింది. అలాగే మరో పాపులర్ మోడల్ అయిన ‘రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ’ (Range Rover Sport SV) ధరను కూడా కంపెనీ ఏకంగా రూ. 40 లక్షల మేర తగ్గించింది. దీంతో ఈ మోడల్ పాత ధర రూ. 2.75 కోట్ల నుంచి రూ. 2.35 కోట్లకు దిగివచ్చింది. ఈ కొత్త ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
రాత్రికి రాత్రే ఇంత భారీ తగ్గింపు ఎందుకు?
సాధారణంగా కార్ల ధరలు పది వేలో, లక్ష రూపాయలో తగ్గుతాయి. కానీ, రాత్రికి రాత్రే ఏకంగా 75 లక్షలు ఎందుకు తగ్గాయని అనుకుంటున్నారా? దీని వెనుక ఉన్న అసలు కారణం ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ (Free Trade Agreement – FTA). భారతదేశం, యునైటెడ్ కింగ్డమ్ (UK) మధ్య కుదిరిన ఈ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో, యూకే నుంచి భారత్‌కు దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లపై కస్టమ్స్ సుంకాలు భారీగా తగ్గాయి. ఆ పన్నుల తగ్గింపు వల్ల కలిగిన ఆర్థిక ప్రయోజనాన్ని జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Range Rover) సంస్థ తన వద్దే ఉంచుకోకుండా.. నేరుగా కొనుగోలుదారులకే బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ వ్యూహాత్మక అడుగుతో భారత ప్రీమియం కార్ల మార్కెట్లో లెక్సస్, మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఇతర బ్రాండ్లకు జేఎల్ఆర్ గట్టి పోటీ ఇవ్వనుంది.
కొత్త కొనుగోలుదారులకు మరో బంపరాఫర్
ఈ భారీ డిస్కౌంట్‌కు తోడు వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీ మరో నిర్ణయం కూడా తీసుకుంది. రేంజ్ రోవర్ (Range Rover) ఎస్వీ మోడల్లో అత్యంత ఖరీదైన ‘ప్రీమియం పెయింట్ ఫినిష్’ను ఇకపై స్టాండర్డ్ ఫీచర్‌గా అందించనున్నట్లు వెల్లడించింది. దీనికోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. అయితే ఈ ఆఫర్‌పై కంపెనీ ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. ఈ భారీ ధరల తగ్గింపు అనేది కేవలం యూకే నుంచి నేరుగా దిగుమతి అయ్యే ఈ రెండు నిర్దిష్ట మోడళ్లపై మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. స్థానికంగా ఇండియాలో తయారయ్యే ఇతర రేంజ్ రోవర్ మోడళ్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఆ పాత ధరలే కొనసాగుతాయని తేల్చి చెప్పింది. ఏది ఏమైనా, కోట్లు వెచ్చించి విదేశీ కార్లు (Range Rover) కొనే కుబేరులకు ఇది నిజంగా పండగ లాంటి వార్తే అని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
