టాప్-3లో మన ‘బుల్లెట్ రాజా’.. లెక్కలు చూస్తే మైండ్ బ్లాంకే!
భారతదేశంలో ‘బుల్లెట్‘ (Bullet) అంటే అదొక బైక్ మాత్రమే కాదు.. ఒక ఎమోషన్, ఒక దర్పం. ఆ డగ్గు డగ్గు సౌండ్ వింటుంటే కుర్రకారుకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దశాబ్దాలుగా ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలుగొందుతున్న మన దేశీయ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ ‘రాయల్ ఎన్ఫీల్డ్’ (Royal Enfield) ఇప్పుడు విశ్వవేదికపై సత్తా చాటింది. ఏకంగా ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆటోమోటివ్ బ్రాండ్ల జాబితాలో మూడో స్థానాన్ని కైవసం చేసుకుని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అత్యంత విలాసవంతమైన అంతర్జాతీయ కార్ల బ్రాండ్లు ఆడి (Audi), ఫెరారీ (Ferrari)లను సైతం వెనక్కి నెట్టి మన బుల్లెట్ రాజా ఈ ఘనత సాధించడం విశేషం.
ఇవి కూడా చదవండి
అగ్రస్థానంలో నిలిపిన రేటింగ్స్ ఇవే
ప్రతిష్టాత్మక ‘బ్రాండ్ ఫైనాన్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ 2026’ నివేదిక ప్రకారం.. గ్లోబల్ మార్కెట్లో టయోటా (Toyota), బీఎండబ్ల్యూ (BMW) తర్వాతి స్థానంలో ప్రపంచంలోనే మూడవ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) అవతరించింది. సంస్థ పనితీరుకు గాను 100కు 88.9 ‘బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్’ (BSI) స్కోరుతో పాటు అరుదైన ‘ఏఏఏ’ (AAA) రేటింగ్‌ను దక్కించుకుంది. ముఖ్యంగా గతేడాదితో పోలిస్తే కంపెనీ బ్రాండ్ విలువ ఏకంగా 30 శాతం ఎగబాకి 1.2 బిలియన్ డాలర్లకు (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 11.33 వేల కోట్లు) చేరుకోవడం సంస్థ సాధించిన అద్భుత ప్రగతికి అద్దం పడుతోంది.
సత్తా చాటిన భారతీయ బ్రాండ్లు
విశేషమేమిటంటే, ఈ గ్లోబల్ జాబితాలో రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) ఒక్కటే కాదు.. ఇతర భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలు సైతం తమ సత్తా చాటాయి. మనదేశానికే చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘టాటా మోటార్స్’ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలవగా.. మహీంద్రా, మారుతి సుజుకి కూడా అత్యుత్తమ బ్రాండ్లుగా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాయి.
విదేశీయులను ఫిదా చేస్తున్న డిజైన్
ఒకప్పుడు కేవలం భారత మార్కెట్‌కే పరిమితమైన రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield).. గత కొన్నేళ్లుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఖండాంతరాలకు విస్తరించింది. విదేశీ రైడర్ల అభిరుచులకు అనుగుణంగా రెట్రో డిజైన్, ఎలాంటి సంక్లిష్టతలు లేని అద్భుతమైన రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లో దీనికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యూరప్, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా మార్కెట్లలో ఏకంగా 3,200కు పైగా రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేసి అమ్మకాల్లో దూసుకుపోతోంది.
ముఖ్యంగా మిడ్-సైజ్ ఇంజిన్ సెగ్మెంట్లో కంపెనీ విడుదల చేసిన ‘హంటర్ 350’, ‘సూపర్ మీటియర్ 650’, ‘హిమాలయన్ 450’ వంటి పవర్ఫుల్ మోడళ్లు అటు యూత్‌ను, ఇటు సుదూర ప్రాంతాలు ప్రయాణించే టూరింగ్ రైడర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఒక భారతీయ సంస్థ (Royal Enfield) ఈ స్థాయిలో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకోవడం ఆటోమొబైల్ రంగంలో ఒక చారిత్రక మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి
