ఇన్‌స్టాగ్రామ్‌లో రాత్రికి రాత్రే మాయమైన సెటెబ్రిటీల ఫాలోవర్లు.. అసలేం జరుగుతోంది?
సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ (Instagram)లో గత కొద్ది గంటలుగా ఎవరి నోట విన్నా ఒకటే మాట.. “నా ఫాలోవర్లు సడన్‌గా ఎందుకు తగ్గిపోతున్నారు?”. అవును, రాత్రి నిద్రపోయి ఉదయం లేచి చూసేసరికి వేలల్లో, లక్షల్లో ఫాలోవర్లు మాయమైపోతుండటంతో యూజర్లు, ముఖ్యంగా డిజిటల్ క్రియేటర్లు, సెలబ్రిటీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా మాతృసంస్థ మెటా (Meta) చేపట్టిన ‘గ్రేట్ పర్జ్’ (Great Purge) ఆపరేషన్ కారణంగా ఇన్‌స్టా వేదికగా ఇప్పుడు ఫాలోవర్ల సునామీలా మాయమవుతున్నారు.
అసలేంటి ఈ ‘గ్రేట్ పర్జ్’?
మీ ఖాతాలో (Instagram) సడన్‌గా ఫాలోవర్లు తగ్గితే ఎవరో మిమ్మల్ని మూకుమ్మడిగా అన్‌ఫాలో చేశారని భయపడాల్సిన అవసరం లేదు. దీని వెనుక అసలు కారణం మెటా సంస్థ చేపట్టిన భారీ ప్రక్షాళన. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన నకిలీ ఖాతాలు (Fake accounts), అసలు యాక్టివ్‌గా లేని ఖాతాలు (Inactive accounts), ముఖ్యంగా ‘బాట్’ (Bot) అకౌంట్లను ప్లాట్‌ఫామ్ నుంచి శాశ్వతంగా ఏరివేసేందుకు సంస్థ కఠినమైన చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాను మరింత పారదర్శకంగా, నమ్మకమైనదిగా మార్చేందుకు ఏఐ (AI) టెక్నాలజీ సాయంతో ఈ ‘బాట్ పర్జ్’ (Bot Purge) నిర్వహిస్తోంది. దీని దెబ్బకు థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా కృత్రిమంగా సృష్టించబడిన ఫాలోవర్ల సంఖ్య అంతా ఒక్కసారిగా గల్లంతవుతోంది.
ఇవి కూడా చదవండి
సెలబ్రిటీలకు భారీ కోత.. ఏకంగా కోట్లల్లో!
సాధారణ యూజర్ల సంగతి పక్కన పెడితే.. గ్లోబల్ స్టార్స్, హాలీవుడ్ ప్రముఖుల అకౌంట్లలో కోత చూస్తే దిమ్మతిరగడం ఖాయం. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ప్రముఖుల అకౌంట్లలోకి ఈ బాట్స్ ఎక్కువగా చేరుతుంటాయి. తాజా క్లీనప్తో వాళ్లకే అతిపెద్ద దెబ్బ పడింది. ఆన్లైన్ నివేదికల ప్రకారం:
ప్రముఖ అమెరికన్ మోడల్ కైలీ జెన్నర్ (Kylie Jenner) ఖాతా (Instagram) నుంచి రాత్రికి రాత్రే అత్యధికంగా సుమారు 1.5 కోట్ల (15 మిలియన్ల) ఫాలోవర్లు మాయమయ్యారు.
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo)కు సైతం ఏకంగా 80 లక్షల (8 మిలియన్ల) ఫాలోవర్లు తగ్గారు.
పాప్ సింగర్స్ టేలర్ స్విఫ్ట్, అరియానా గ్రాండే, అలాగే ప్రఖ్యాత బ్యాండ్ బీటీఎస్ (BTS) అకౌంట్ల నుంచి కూడా తలా 50 లక్షల నుంచి 70 లక్షల మంది ఫాలోవర్లు ఆవిరైపోయారు.
ఇన్ఫ్లుయెన్సర్ల గుండెల్లో రైళ్లు
ఈ అనూహ్య పరిణామం ఇన్స్టాగ్రామ్ (Instagram) ఎంగేజ్మెంట్‌నే నమ్ముకుని లక్షలు సంపాదిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. వాస్తవానికి డబ్బులు ఇచ్చి ఫేక్ ఫాలోవర్లను కొనుగోలు చేసి బ్రాండ్ ప్రమోషన్స్ (Sponsorships) సాధిస్తున్న వారి బండారం ఇప్పుడు బట్టబయలు అవుతోంది. ఫాలోవర్ల సంఖ్య అమాంతం పడిపోవడంతో వారి బ్రాండ్ వాల్యూ పడిపోయి స్పాన్సర్షిప్ డీల్స్ ప్రమాదంలో పడుతున్నాయి. కేవలం ఆర్గానిక్ ఎంగేజ్మెంట్, నిజమైన ఫాలోవర్లు ఉన్నవారికి మాత్రమే ఇకపై ఆన్లైన్ రంగంలో భవిష్యత్తు ఉంటుందని, ‘ఫేక్ ఫాలోవర్స్’ సామ్రాజ్యానికి ఇన్స్టాగ్రామ్ గట్టిగా చెక్ పెట్టిందని డిజిటల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
