Lavanya Tripathi: సోషల్ మీడియా వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన లావణ్య
లావణ్య త్రిపాఠి(Lavanya tripathi) తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపులపై కఠిన చర్యలకు దిగారు. గత కొంతకాలంగా తనను మరియు తన కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసుకుని అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తన కంప్లైంట్ లో ‘పర్పుల్ క్రెయాన్00′(Purple rayon 00) అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన పర్సనల్ లైఫ్, నైతిక విలువలను కించపరిచేలా పలు పోస్టులు చేస్తున్నారని లావణ్య పేర్కొన్నారు. అత్యంత అసభ్య పదజాలంతో కామెంట్లు చేస్తూ తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వేధింపులు తన కుటుంబ సభ్యులపై కూడా ప్రభావం చూపుతున్నాయని, కాబట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. అలాగే ఆ వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
లావణ్య ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు టెక్నికల్ ప్రూఫ్స్ తో విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా జరిగే దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
