బండి తనయుడి కేసులో జాప్యం.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..!
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఒక మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డారన్న ఆరోపణలు, దానిపై నమోదైన కేసులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఉదంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాధితులకు న్యాయం చేయడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఈ కేసు నమోదులో జరిగిన జాప్యంపై సీఎం రేవంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దీనిపై డీజీపీ సీవీ ఆనంద్‌ను స్వయంగా పిలిపించి వివరణ కోరారు. ఈ నెల 8నే బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ, నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరగడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలై నిమగ్నమైందని, అందుకే జాప్యం జరిగిందని డీజీపీ సీవీ ఆనంద్ వివరణ ఇచ్చారు.
కేసు పూర్వాపరాలను నిశితంగా పరిశీలించిన ముఖ్యమంత్రి, తక్షణమే సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపాలని, ఎక్కడా సాక్ష్యాలు తారుమారు కాకుండా పారదర్శకమైన నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు. “న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని” అధికారులను హెచ్చరించారు.

తన 17 ఏళ్ల కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పేట్‌బషీరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలు మైనర్ కావడంతో నిందితుడిపై కఠినమైన సెక్షన్లను ప్రయోగించారు. బాలికపై లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన వంటి అంశాల ఆధారంగా ఈ అభియోగాలు మోపారు.
కేసు విచారణ సాగుతుండగానే ఈ ఉదంతం మరో మలుపు తిరిగింది. సదరు బాలిక తల్లిదండ్రులు తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ కరీంనగర్ పోలీసులను ఆశ్రయించారు. తన ప్రతిష్ఠను భంగం కలిగించేలా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్ టూటౌన్ పోలీసులు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసు ఇరుపక్షాల ఫిర్యాదులతో క్లిష్టంగా మారింది.
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించినట్లు తెలుస్తోంది. కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్ రెడ్డి ఇప్పటికే సైబరాబాద్ సీపీ నుంచి పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకున్నారు. దీనిపై లోతైన విచారణ జరిపేందుకు కమిషన్ ఒక ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేసింది. బాలిక భద్రత, మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని కమిషన్ విచారణను వేగవంతం చేయనుంది.
ముఖ్యమంత్రి నేరుగా జోక్యం చేసుకోవడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాబోయే 24 గంటల్లో ప్రత్యేక బృందాలు బాధితులు, సాక్షుల నుంచి వాంగ్మూలాలను సేకరించనున్నాయి. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో తదుపరి అరెస్టులు లేదా ఇతర చర్యలు ఉండవచ్చు. రాజకీయంగా కూడా ఈ అంశం కాక రేపుతోంది. విచారణ పారదర్శకంగా జరగాలని అధికార పక్షం అంటుంటే, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ కుమారుడిని ఇరికించారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏది ఏమైనా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, శాంతిభద్రతల విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి