మళ్లీ పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు.. ?
పశ్చిమాసియాపై మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. యుద్దం ముగింపునకు ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోసిపుచ్చారు. ఇరాన్ షరతులు..‘పూర్తిగా ఆమోదయోగ్యం కాదు’ అని ఆయన తేల్చిచెప్పారు. ఈ పరిణామంతో వారాలుగా జరుగుతున్న చర్చలు విఫలమై మళ్లీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు పెరిగాయి. తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ట్రంప్ స్పందిస్తూ “ఇరాన్ ప్రతినిధుల స్పందనను చదివాను. అది నాకు నచ్చలేదు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు!” అని పోస్ట్ చేశారు.
యుద్ధం ప్రారంభం కావడానికి ప్రధాన కారణమైన ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఇప్పటికే నియంత్రించామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ సైనికంగా ఓడిపోయిందన్నారు. మరోవైపు, ఇరాన్ తన శుద్ధి చేసిన యురేనియంలో కొంత భాగాన్ని గాఢత తక్కువ చేసి, మిగిలినదాన్ని మూడో దేశానికి తరలించడానికి అంగీకరించినట్టు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తెలిపింది. చర్చలు విఫలమైతే ఆ యురేనియం తిరిగి తమకు అప్పగించాలనే హామీని ఇరాన్ కోరినట్టు మధ్యవర్తి పాకిస్థాన్ ద్వారా తెలిసిందని ఆ కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి
అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ కూడా తిరస్కరించింది. తమకు అమెరికా యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, హర్మూజ్ జలసంధిపై పూర్తి సార్వభౌమాధికారం ఇవ్వాలని, ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.”శత్రువుకు ఎప్పటికీ తలొగ్గం. చర్చలు అంటే లొంగిపోవడం కాదు” అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్ ఎక్స్‌లో స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్‌లోని యురేనియం నిల్వలను పూర్తిగా తొలగించి, అణు కేంద్రాలను కూల్చివేసే వరకు యుద్ధం ముగియదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
ప్రస్తుతం హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించగా.. ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం దిగ్బంధించింది. ఈ నేపథ్యంలో, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య ప్రవాహాలను పునరుద్ధరించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ 40 దేశాలతో రక్షణ మంత్రుల సమావేశం ఏర్పాటు చేయనున్నాయి. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాలు తమ మొండి వైఖరిని వీడకపోవడంతో పశ్చిమాసియా శాంతి ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది.
ఇవి కూడా చదవండి
