ఇరాన్ పై యుద్ధానికి ఎండ్ కార్డ్ ..! కాంగ్రెస్ కు ట్రంప్ జవాబు..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి నాలుక మడతపెట్టారు. ఇరాన్ పై తాము జరిపింది యుద్ధం కాదని..కేవలంపరిమిత సైనిక చర్య అని కాంగ్రెస్ కు తెలిపారు. ఇరాన్‌తో ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినందున, యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. అమెరికా చట్టాల ప్రకారం అధ్యక్షుడు ఏ దేశంపైనైనా యుద్ధం ప్రారంభిస్తే 60 రోజుల్లోగా కాంగ్రెస్ ఆమోదం పొందాలి.
ఇరాన్‌పై ట్రంప్ ప్రభుత్వం ఫిబ్రవరి 28న సైనిక చర్య ప్రారంభించి, మార్చి 2న కాంగ్రెస్‌కు అధికారికంగా తెలియజేసింది. దీంతో శుక్రవారానికి 60 రోజుల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో, 1973 నాటి చట్టం ప్రకారం కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగలేదని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సెనెట్‌లో తెలిపారు. అయితే, ఈ వాదనను ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గడువు ముగిసినందున ఇరాన్ నుంచి అమెరికా బలగాలను తక్షణమే వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒకవైపు రాజకీయంగా మాటల యుద్ధం జరుగుతున్నప్పటికీ, మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇరాన్‌పై యుద్ధం కొనసాగించాల్సి వస్తే, భీకర దాడి చేసేందుకు ‘డార్క్ ఈగిల్’ అనే హైపర్సోనిక్ క్షిపణులను వాడేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు సైనిక చర్య ముగిసిందని ట్రంప్ .. కాంగ్రెస్ కు చెప్పారు. మళ్లీ సైనిక చర్య అంటూ దానికి బడ్జెట్ కేటాయించాలని ఓవేళ కోరితే పరిస్థితి ఎలా ఉంటుంది… దీనికి కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది. అంటే ట్రంప్.. ఇప్పుడు తన దారిని తనే మూసుకున్నారా…? ఇకపై భీకర దాడులు జరిగే పరిస్థితి ఉంటుందా..? లేక శాంతి ప్రక్రియ నెమ్మదిగా పట్టాలెక్కుతుందా..? ఇవన్నీ కాలం వదిలిన ప్రశ్నలు.. వీటికి ఆ సమయమే సమాధానం చెప్పాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
