వై కాంబినేటర్ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలు.. హర్షితా అరోరా సరికొత్త రికార్డు!
Harshita Arora: సాధారణంగా 24 ఏళ్ల వయసు అంటే కెరీర్ ప్రారంభించే దశ. కానీ, అదే వయసులో ప్రపంచ ప్రఖ్యాత స్టార్టప్ ఇంక్యుబేటర్ వై కాంబినేటర్ (Y Combinator) లో జనరల్ పార్ట్నర్గా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు హర్షితా అరోరా. ఎయిర్‌బీఎన్‌బీ, మీషో, జెప్టో వంటి దిగ్గజ సంస్థలకు అండగా నిలిచిన ఈ సంస్థలో, ఇంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా ఆమె నిలిచారు.
హర్షిత ప్రస్థానంలోని విశేషాలు..
స్కూలుకు గుడ్ బై ..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన హర్షిత 13 ఏళ్లకే కోడింగ్‌పై ఆసక్తి పెంచుకున్నారు. సాంప్రదాయ చదువు కంటే టెక్నాలజీ మిన్న అని భావించి 15 ఏళ్లకే స్కూలు మానేశారు. సొంతంగా ఆన్లైన్ వేదికల ద్వారా కోడింగ్ నేర్చుకున్నారు. 17 ఏళ్ల వయసులో ‘క్రిప్టో ప్రైస్ ట్రాకర్’ అనే యాప్‌ను రూపొందించారు. దీనికి అంతర్జాతీయంగా విశేష స్పందన రావడంతో ఒక సంస్థ ఆ యాప్‌ను కొనుగోలు చేసింది.
‘ఎ టు బి’ స్టార్టప్..
అమెరికాలో ట్రక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ‘ఎ టు బి’ (A to B) అనే ఫిన్‌టెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. 2022 నాటికి ఈ సంస్థ విలువ సుమారు రూ. 6,400 కోట్లకు చేరింది. టెక్ రంగంలో ఆమె కనబరుస్తున్న ప్రతిభకు గుర్తింపుగా 2020లో భారత ప్రభుత్వం నుంచి ‘బాల్ శక్తి పురస్కారం’ అందుకున్నారు. ప్రధాని మోదీ సైతం ఆమె కృషిని అప్పట్లో కొనియాడారు.
పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు..
గతంలో అదే సంస్థలో విజిటింగ్ పార్ట్నర్గా ఉన్న హర్షిత, ఇప్పుడు జనరల్ పార్ట్నర్గా కొత్త స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేయడంతో పాటు, పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మొండి పట్టుదల, టెక్నాలజీపై ఉన్న మక్కువతో హర్షిత సాధించిన ఈ విజయం నేటి యువతకు, ముఖ్యంగా టెక్ రంగంలోకి రావాలనుకునే వారికి గొప్ప స్ఫూర్తినిస్తోంది.
ఇవి కూడా చదవండి
